
భువనేశ్వర్: బిజూ జనతా దళ్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పూరీ నుంచి పోటీ చేస్తారని పలు వర్గాల నుంచి ప్రచారం ఊపందుకుంది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈసారి కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలపై పలు వర్గాల్లో చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో పూరీ శాసనసభ స్థానం బీజేడీ చేజార్చుకుంది. ఈ వ్యవధిలో ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఉనికిని బలపరచుకుంది. ఈ పరిస్థితుల్లో బిజూ జనతా దళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ పూరీ నియోజకవర్గం నుంచి సత్తా చాటుకోవాలనే సవాళ్లు తలెత్తాయి. ఈ చర్చ రాజకీయ శిబిరాల్లో వాడివేడిగా సాగుతోంది. పూరీ నుంచి నవీన్ రంగంలోకి దిగితే బీజేపీ, బీజేడీ మధ్య హోరాహోరీ పోటీ శాసనసభ ఎన్నికల ఘట్టాన్ని రక్తి కట్టిస్తుంది.
ఆయనదే తుది నిర్ణయం
ఏ స్థానం నుంచి పోటీ చేయాలనేది బీజేడీ అధ్యక్షుడిగా నవీన్ పట్నాయక్‌దే తుది నిర్ణయం. అయితే చిట్ట చివరి క్షణం వరకు కీలక నిర్ణయాలను బయటకు పొక్కనీయకుండా ఆయన అత్యంత జాగ్రత్త ప్రదర్శిస్తారు. ఈసారి ముందస్తుగా ఆయన వార్తల్లోకి ఎక్కడం విశేషం. సాధారణంగా బహిరంగ చర్చలు, వ్యాఖ్యలు వగైరా వ్యవహారాల్లో నవీన్ ప్రస్తావన శూన్యం. ఆయనకు అత్యంత సన్నిహితంగా మెసలుతున్న 5టీ కార్యదర్శి వి.కె.పాండియన్ విహంగ పర్యటనల దుమారంతో ముఖ్యమంత్రి హోదాలో ప్రత్యక్షంగా హాజరై సభలో వివరణ ఇవ్వాల్సి వచ్చింది. వివాదాలకు దూరంగా ఉంటూ హుందాతనానికి మారుపేరుగా సుపరిచిత నవీన్ పట్నాయక్ ఇలా సభలో వివరణ ఇవ్వడం ప్రముఖుల దృష్టిని ఆకట్టుకుంది.
వ్యూహాత్మక శైలి
ముందస్తు ఎన్నికలపై చెలరేగిన దుమారం మీద పెదవి కదపని ముఖ్యమంత్రి పలు ప్రజాకర్షిత పథకాలను శరవేగంగా ప్రవేశపెట్టి విపక్షాలకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. ప్రధానంగా మహిళా ఓటర్లను ఆకట్టుకునే దిశలో పలు పథకాలను చకచకా ప్రవేశ పెడుతున్నారు. మిషన్ శక్తి ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికలు–2024 మిషన్ విజయ బాటలో దూసుకుపోవడం తథ్యమనే సంకేతాలు బలపడుతున్నాయి. పూరీ ప్రాంతంలో ఇటీవల బీజేడీ వ్యతిరేక పవనాలు బలం పుంజుకుంటున్నాయి. ఈ పరిస్థితి విపత్తుగా పరిణమించక ముందే జాగ్రత్త వహించే దిశలో నవీన్ పట్నాయక్ అభ్యర్థిత్వాన్ని తెరపైకి తేవడం రాజకీయ వ్యూహంగా స్పష్టం అవుతుంది. పూరీ శ్రీజగన్నాథ మందిరం ప్రాకార ప్రాజెక్టు మొదలుకొని పలు పథకాలు, ప్రాజెక్టుల కార్యాచరణ తీవ్ర కలకలం రేపాయి.
ఈ వివాదాలు నేటికీ చాప కింద నీరులా మరుగున పొంచి ఉన్నాయి. పూరీ నుంచి పోటీ చేయాలని ముఖ్యమంత్రికి పలు వర్గాలు అభ్యర్థిస్తున్నాయి. ప్రజారణతో శ్రీజగన్నాథుని ఆశీస్సులు తమ నాయకునికి అండగా నిలిపి ప్రతిష్టాత్మకంగా గెలిపిస్తాయని బీజేడీ శిబిరాల్లో చర్చ నడుస్తోంది. పూరీ నుంచి పోటీ ఊహాగానాలు వాస్తవ రూపం దాల్చితే సొంత పార్టీ శ్రేణులకు అతీతంగా ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బలమైన మద్దతుతో భారీ ఆధిక్యతతో గెలిపిస్తారని శ్రీజగన్నాథుని సీనియర్ సేవాయత్ రామకృష్ణ దాస్ మహాపాత్రో ఇటీవల ఒక సందర్భంలో పేర్కొన్నారు. ఈ ప్రకటన నవీన్ పట్నాయక్ పూరీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం తథ్యం అనే సంకేతాలు పంపిస్తోంది.
విజయం తథ్యం
ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు ఎక్కడి నుంచి పోటీ చేసినా విజయం తథ్యమని ఆ పార్టీ సీనియర్ నాయకుడు శశి భూషణ్ బెహరా శుక్రవారం అన్నారు. నవీన్ నాయకత్వంపై రాష్ట్ర ప్రజల్లో మక్కువ బలపడింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల ఆదరాభిమానాలు ఆయనను తిరుగులేని నాయకుడిగా నిలబెట్టాయి. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఆయన ఏ స్థానం నుంచి పోటీ చేసినా ప్రజలు విజయ కిరీటంతో పట్టం గడతారని పేర్కొన్నారు. రాష్ట్ర బహుముఖ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలు విశేష గుర్తింపు సాధించాయన్నారు. ఆయన నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ పాలన విశేష ప్రజాదరణ చూరగొంది. నవీన్ సుదీర్ఘ సుస్థిర పాలన ప్రజల్లో చెక్కు చెదరని నమ్మకానికి పీఠం వేసింది. ఏటా ఆయన ప్రజాదరణ బలపడుతునే ఉందని బీజేడీ వర్గాలు ధీమా వ్యక్తం చేయడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment