
రసవత్తరంగా హింజిలికాటు ఎన్నిక
సీఎంకు పోటీగా బీజేపీ అభ్యర్థి శిశిర్ మిశ్రా
స్థానికత పేరుతో ప్రచారం
భువనేశ్వర్: గంజాం జిల్లా హింజిలికాటు నియోజకవర్గం ఎన్నిక ఈసారి రసవత్తరంగా ఉంటుంది. ఈ నియోజకవర్గం నుంచి బిజూ జనతా దళ్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో ముఖాముఖి తలపడేందుకు భారతీయ జనతా పార్టీ సరికొత్త ముఖాన్ని రంగంలోకి దింపింది. వరుసగా 6వసారి తిరిగి ఎన్నికవ్వాలని ఉరకలేస్తున్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను ఓడించేందుకు బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో కొత్త ముఖం శిశిర్ మిశ్రాని అభ్యర్థిగా ప్రకటించింది. ఈయన దివంగత శరత్ మిశ్రా తమ్ముడు. గంజాంలో కాషాయ పార్టీ పునాదిని బలపరిచిన వ్యక్తిగా పేరొందాడు. శిశిర్ మిశ్రా 2019 ఎన్నికల్లో హింజిలీలో బీజేపీ అభ్యర్థి అయిన న్యాయవాది పీతాంబర్ ఆచార్యకు సమన్వయకర్తగా పని చేశాడు.
ప్రదీప్ అనుభవంపై ఆశలు
బరంపురం లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి గా ప్రదీప్ పాణిగ్రాహి పోటీ చేస్తున్నాడు. ఇతను అనేక సంవత్సరాలుగా ముఖ్యమంత్రి తరుపున నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించి, హింజిలికాట్‌లో నవీన్ పట్నాయక్ విజయంలో భాగస్వామిగా నిలిచారు. ప్రస్తుతం ప్రదీప్ పాణిగ్రాహి బీజేడీ నుంచి వైదొలగి బీజేపీ అభ్యర్థిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అనుభవం హింజిలి నుంచి బీజేపీ టిక్కెట్టుతో పోటీ చేస్తున్న శిశిర్ మిశ్రాకు బలమైన గెలుపు వనరుగా దోహదపడుతుందని ఆశిస్తున్నాడు. వ్యూహాత్మకంగా శిశిర్‌ని హింజిలి నుంచి బీజేపీ బరిలోకి దింపి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు ధీటైన పోటీనిచ్చేందుకు నడుం బిగించింది. వీరివురి పోరుతో గంజాం జిల్లాలో కీలకమైన నియోజకవర్గంగా పేరొందిన హింజిలి ఎన్నిక రసవత్తరంగా ఉంటుంది.
బీజేపీ బలం పెరిగింది: శిశిర్ మిశ్రా
నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బలం పుంజుకుంటుందని శిశిర్ మిశ్రా అన్నారు. ఇటీవల ముగిసిన మున్సిపాలిటీ, జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీజేడీకి గట్టిపోటీ ఇచ్చామని తెలిపారు. తాను స్థానికుడినని తెలియజేశారు. పాఠశాల నుంచి కళాశాల విద్యను ఇక్కడే పూర్తి చేసినట్లు తెలియజేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు జగన్నాథ్ మిశ్రా మనవడినని గుర్తు చేశారు. ప్రధానమంత్రి నాయకత్వంలో సురక్షితమైన, సుసంపన్నమైన భారతదేశం దార్శనికతను సాకారం చేసేందుకు మోదీ జీ హామీ ఆధారంగా ఓట్లు పొందేందుకు ప్రచారం చేయనున్నట్లు వివరించాడు. హింజిలి నియోజకవర్గంలో క్రమంగా నవీన్ పట్నాయక్ గ్లామర్ మసకబారుతుందని ఆరోపించారు. ఆయన తొలిసారిగా 2000 సంవత్సరంలో పోటీచేసి భారీ ఆధిక్యతతో గెలిపొందారు. ఈ ఆధిక్యత 2019 సార్వత్రిక ఎన్నికల్లో భారీగా దిగజారిందన్నారు.
ఈసారి గెలిస్తే రికార్డు
2000లో హింజిలి నుంచి 29,826 ఓట్ల తేడాతో గెలిపొందిన నవీన్ పట్నాయక్‌కు, 2014 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిక్యత భారీగా 76,586కి పెరిగింది. 2019 ఎన్నికల నాటికి 5 ఏళ్ల తర్వాత 60,160కి పడిపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ అధ్యక్షుడు పశ్చిమ ఒడిశా నియోజకవర్గమైన బీజేపూర్, గంజాం జిల్లా హింజిలి రెండింటి నుంచి పోటీ చేసి గెలిపొందారు. హింజిలీని నిలబెట్టుకుని పశ్చిమ ఒడిశా బీజేపూర్ స్థానం నుంచి వైదొలిగారు. ఇదిలా ఉండగా త్వరలో జరగనున్న ఎన్నికల్లో బీజేడీ తిరిగి అధికారంలోకి వస్తే నవీన్ పట్నాయక్ సిక్కింకు చెందిన పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డును అధిగమించి దేశంలోనే దీర్ఘకాలిక ముఖ్యమంత్రిగా రికార్డు ఆవిష్కరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment