సీఎం మోహన్‌చరణ్ మాఝీ
ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం
బాధితులందరికీ సాయం అందేలా చర్యలు
పూర్తిగా దెబ్బతిన ఇళ్లకు రూ.1.20 లక్షల పరిహారం
ప్రకటించిన సీఎం మోహన్‌చరణ్ మాఝీ
భువనేశ్వర్: రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదలతో భారీ నష్టం సంభవించింది. ప్రధానంగా బాలాసోర్ జిల్లాలో పంటలు, ఇళ్లు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. దీంతో బాధితులకు ప్రభుత్వ సాయం అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ప్రకటించారు. పూర్తిగా దెబ్బ తిన్న ఇళ్లకు రూ.1.20 లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న పక్కా ఇళ్లకు రూ. 6,500, మట్టి ఇళ్లకు రూ.4 వేలు చొప్పున ఆర్థిక సాయం లభిస్తుందని పేర్కొన్నారు. జల దిగ్బంధంలో చిక్కుకున్న బాధితులకు దుస్తులు, వంట పాత్రల కోసం చెరో రూ.2,500 చొప్పున ఆర్థిక సాయం అందుతుందన్నారు.
రైతులకు మేలు
పంట నష్టానికి గురైన చిన్న, సన్నకారు రైతాంగానికి 1 హెక్టారు విస్తీర్ణపు వర్ష ఆధార పొలాల్లో పంట నష్టానికి రూ.8,500, సాగు నీటి వనరుల పొలాల్లో పంట నష్టానికి హెక్టారు విస్తీర్ణానికి రూ.17 వేలు, నిత్య పంట పొలాలకు హెక్టారుకు రూ.22,500 చొప్పున పరిహారం లభిస్తుంది. అయితే ఈ సాయం గరిష్ట పరిమితి 2 హెక్టార్లకు మాత్రమే పరిమితంగా పేర్కొన్నారు. ఇసుక మేట వేసిన పంట పొలాలకు పరిహారం కింద అతి తక్కువగా రూ.2200, గరిష్టంగా రూ.18 వేలు సన్నకారు, బలహీన రైతాంగానికి చెల్లిస్తారు. నదిగట్లు తెగి పొలాల్లో వరద నీరు పొంగిపొర్లి నష్టం ఏర్పడిన పరిస్థితుల్లో పీడిత వర్గాలకు కనీస పరిహారం రూ.5,000 కాగా, గరిష్ట పరిహారం రూ.47 వేలుగా పేర్కొన్నారు.
మత్స్యకారులకు ప్యాకేజీ
వరదల ప్రభావంతో మత్స్యకారులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. పూర్తిగా దెబ్బ తిన్న చేపల వేట పడవకు రూ.15 వేలు, పాక్షికంగా దెబ్బతిన్న పడవలకు రూ.6 వేలు చొప్పున పరిహారం చెల్లిస్తారు. పాక్షికంగా దెబ్బ తిన్న చేపల వలకు రూ.3 వేలు చొప్పున, పూర్తిగా దెబ్బతిన్న వలకు రూ.4 వేలు చొప్పున ఆర్థిక సాయం మంజూరు చేస్తారు. చేపల సాగు ఒక హెక్టార్ విస్తీర్ణం నష్టానికి రూ.10 వేలు చొప్పున పరిహారం మంజూరవుతుందని ప్రకటించారు.
పాడి పశువులకు పరిహారం
వరద తాకిడితో నష్టాలు సంభవించిన పాడి రైతులకు పరిహారం ప్రకటించారు. ఒక్కొక్క ఆవు, గేదెకి రూ.37,500, ఒక్కొక్క మేక, గొర్రెకి రూ.4 వేలు చొప్పున పరిహారం చెల్లిస్తారు. బండ్లు లాగే ఎడ్లు, బర్రెలు వంటి పశువుల నష్టానికి రూ.32 వేలు చొప్పున, దూడలు, గాడిద వంటి పశువుల నష్టానికి రూ.20 వేలు చొప్పున నష్ట పరిహారం నిర్ధారించారు. పశువులశాల పునరుద్ధరణ కోసం రూ.3 వేలు ఆర్థిక సాయం అందజేస్తారు. ఒక్కో కుటుంబానికి అత్యధికంగా 3 పెద్ద పాడి పశువులు లేదా 30 చిన్న పాడి పశువులు లేదా బండ్లు లాగే 3 పెద్ద పశువులు లేదా 6 చిన్న పశువులకు పరిహారం పరిమితం అవుతుందని స్పష్టం చేశారు.
చేనేత వర్గాలకు సాయం
వరద పీడిత చేనేత, హస్తకళ వర్గాలకు ముఖ్యమంత్రి సాయం ప్రకటించారు. ఈ వర్గపు యంత్ర పరికరాలు, పనిముట్ల నష్టానికి ఒక్కో వ్యక్తికి రూ.5 వేలు, అనుబంధ సరంజామా నష్ట పరిహారం కింద రూ.5 వేలు చొప్పున ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు.
అపార నష్టం
బాలాసోర్ జిల్లాలో వరదలతో రహదారులు, స్తంభాలు, పాఠశాలలు, ప్రాథమిక, సామూహిక ఆరోగ్య కేంద్రాలు, 11 కేవీ విద్యుత్ వ్యవస్థ, తాగునీరు పంపిణీ వ్యవస్థ, లఘు సాగు నీటి ప్రాజెక్టులు యువజన కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాలు ఇతరేతర కట్టడాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. అనుబంధ విభాగాలు, శాఖల క్షేత్ర స్థాయి నివేదిక ఆధారంగా వీటి పునరుద్ధరణ కోసం సముచిత ప్యాకేజీ ప్రకటించడం జరుగుతుందని ముఖ్యమంత్రి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment