కట్నం ఇవ్వలేదని సారె సామాను దగ్ధం
భువనేశ్వర్: రాష్ట్రంలో విభిన్నమైన వర కట్న, కానుకల వివాదం వెలుగు చూసింది. నయాగడ్ జిల్లా దసపల్లా ఠాణా బురుసాహి గ్రామస్తుడు బిజయ్ నాయక్‌తో నెక్కిగుడా గ్రామస్తురాలు మమత నాయక్‌కు 20 ఏళ్ల కిందట పెళ్లి జరిగింది. పెళ్లి మొదలుకొని నిన్న మొన్నటి వరకు వీరి వైవాహిక జీవనం ఆనందమయంగా సాగింది.
ఇటీవల కాలంలో బిజయ్ నాయక్ పెళ్లి నాటి ప్రతిపాదన ప్రకారం అపాచి బైక్, నగదు కానుకగా ఇవ్వాలని మంతనాలు ప్రారంభించాడు. అతని భార్య ఇందుకు నిరాకరించడంతో భార్యాభర్తల మధ్య బేదాభిప్రాయాలు బలం పుంజుకుని తరచు వాదులాట పెరిగింది. కొడుకు పక్షాన నిలిచిన తల్లి కోడలిని వేధించడం ఆరంభించింది. ఎదిగిన పిల్లల సమక్షంలో భర్త, అత్త వేధింపుల్ని సహించలేని పరిస్థితుల్లో ఆమె పిల్లలతో సహా ఇల్లాలు పుట్టింటికి వెళ్లిపోయింది. వారం రోజులు గడిచిన తర్వాత అత్త వారింటికి వెళ్లిన అల్లుడు అత్త, మామ, బావ మరిది సమక్షంలో తన భార్యని దుర్భాషలాడారు. అయినా ఉక్రోషం చల్లారక పోవడంతో పెళ్లి సందర్భంగా సమర్పించిన సారె సామానుని అత్త వారింటి ముందు పోగు చేసి పెట్రోలు పోసి దగ్ధం చేశాడు. ఈ సమగ్ర సంఘటన స్థానికుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. దీనిపై దసపల్లా ఠాణాలో బాధిత ఇల్లాలు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment