విశాఖ సిటీ: హనీ ట్రాప్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ధనికులు, వ్యాపారవేత్తలు, వివాహమైన వారికి వల వేసి ప్రేమాయణం నడిపి బ్లాక్‌మెయిల్ చేసి రూ.లక్షలు కాజేసిన జాయ్ జమీమా వెనుక ఉన్న ప్రధాన ముఠా సభ్యుడు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన వేణుభాస్కర్‌రెడ్డిని విశాఖ ఎయిర్‌పోర్ట్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. జాయ్ జమీమాతో సహజీవనం చేసే వేణుభాస్కర్‌రెడ్డి వెనకుండి బాధితులపై దాడులు, హత్యాయత్నం చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు విచారణలో నిర్ధారణైంది. వివరాల్లోకి వెళితే..
జాయ్ జమీమా అనే మహిళ విశాఖ నగరంలో పలువురు బడాబాబులకు వలపు వల విసిరి, వారితో సన్నిహితంగా ఉన్న ఫొటోలతో బ్లాక్‌మెయిల్ చేసి రూ.లక్షలు కాజేసింది. డబ్బు కోసం కొంత మందిపై దాడులు, హత్యాయత్నాలు కూడా చేసింది. ఆమె ట్రాప్‌లో చిక్కిన ఒక బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సినిమా తరహాలో మత్తు మందు ఇచ్చి బాధితులను లొంగదీసుకొని వీడియోలు తీసి బెదిరింపులకు దిగిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఆమె అరెస్టు తరువాత వరుసగా బాధితులు బయటకు వచ్చి నగరంలో పలు పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.
కీలక సూత్రధారి కోసం ప్రత్యేక బృందాలు..
పోలీసుల విచారణకు జాయ్ జమీమా కనీసం సహకరించకపోగా తిరిగి వారిపైనే బెదిరింపులకు దిగింది. ఒక మహిళ ఇంత మందిని మోసం చేయడం, దాడులు చేయడం వెనుక ఉన్న వారి కోసం పోలీసులు నిఘా పెట్టారు. కొంతమంది బాధితులపై దాడులు చేసిన క్రమంలో ఆమెతో పాటు ఆమె స్నేహితుడు కూడా ఉన్నట్లు పలువురు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిచ్చిన సమాచారంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఆమె కాల్ డేటా, బ్యాంక్ లావాదేవీలు, ఇతర సాంకేతిక అంశాలపై దృష్టి పెట్టారు. ఇందులో లభించిన సమాచారంతో పోలీసులు ఆమె స్నేహితుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఈ కేసు రాజకీయ, సామాజికవర్గ రంగు పులుముకుంది. మాజీ మంత్రి హర్షకుమార్ నేరుగా విశాఖకు వచ్చి జాయ్ జమీమా కేసులో పోలీసులపై ఆరోపణలు సైతం చేశారు. దీంతో పోలీసులు ఈ కేసులో మరింత స్పీడ్ పెంచారు.
పోలీసులకు చిక్కిన కీలక సభ్యుడు
ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు జాయ్ జమీమా వెనుక ఉన్నది శ్రీకాకుళం జిల్లాకు చెందిన వేణుభాస్కర్‌రెడ్డి అని గుర్తించారు. జమీమా, వేణుభాస్కర్‌ల మధ్య జరిగిన నగదు లావాదేవీల సాక్ష్యాలను సైతం సేకరించారు. మద్దిలపాలెం ప్రాంతంలో ఉండే ఒక వ్యక్తిని కూడా మత్తులోకి దించి, బెదిరించి హత్యాయత్నం చేసి భారీగా మొత్తంలో నగదు కాజేసినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. వేణుభాస్కర్‌రెడ్డి కూడా పలు కేసుల్లో ముద్దాయిగా ఉంటూ తప్పించుకొని తిరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో ప్రత్యేక బృందాలతో గాలించిన పోలీసులకు వేణుభాస్కర్‌రెడ్డి ఎన్‌ఏడీ కొత్తరోడ్ వద్దే పట్టుబడ్డాడు. దీంతో శనివారం అతడిని అరెస్టు చేశారు. కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment