హిరమండలం: వంశధార జలాలను శివారు ప్రాంతాలకు అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు డిమాండ్ చేశారు. శనివారం సీపీఎం బృందం గొట్టా బ్యారేజీ, వంశధార రిజర్వాయర్‌లను పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొట్టా బ్యారేజీని ఆధునీకరించడంతో పాటు కాలువల మరమ్మతులు చేపట్టాలని కోరారు. దీనివల్ల లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చన్నారు. వంశధార రిజర్వాయర్‌కు అనుసంధానంగా నేరడి వద్ద బ్యారేజీ ఎప్పుడు కడతారని ప్రశ్నించారు. జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నా జిల్లాకు ఎటువంటి ప్రయోజనం లేకుండాపోతోందన్నారు. తక్షణం గొట్టాలో ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తిచేసి రిజర్వాయర్‌కు నీటిని మళ్లించాలన్నారు. ఒడిశాతో సరిహద్దు జలాల సమస్యను పరిష్కరించి నేరడి బ్యారేజీ నిర్మాణం పూర్తిచేయాలన్నారు. వంశధార జలాలు శివారు ప్రాంతాలుగా ఉన్న ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలకు అందడం లేదన్నారు. వంశధార–నాగావళి నదుల అనుసంధానాన్ని పూర్తిచేయాలని కోరారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలన్న డిమాండ్‌తో ఏప్రిల్ 5న ప్రజాసంఘాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటుచేస్తున్నట్టు ప్రకటించారు. కార్యక్రమంలో సీపీఎం కార్యవర్గ సభ్యులు మోహనరావు, పోలాకి ప్రసాద్, సిర్ల ప్రసాదరావు, సూరయ్య, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.