
గిరిజన రైతు కంట కన్నీరు..
● జీడిమామిడికి తెగుళ్ల దెబ్బ
● తగ్గనున్న దిగుబడి
● ఆందోళనలో రైతులు
సీతంపేట: గిరిజనుల ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తున్న జీడిపంట ఈ ఏడాది దెబ్బతింది. అగ్గి తెగులు వల్ల కొన్ని ప్రాంతాల్లో పూత మాడిపోవడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. పూర్తిస్థాయిలో దిగుబడి రాకపోవడంతో గిరిజనులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. అధిక ఉష్ణోగ్రత, తేనె మంచుతో పూత రాలేదు. అక్కడక్కడ తోటల్లో కొద్దిపాటి పూత వచ్చిందంటే అది కూడా మాడిపోయింది. సీతంపేట ఐటీడీఏ పరిధిలో టీపీఎంయూ పరిధిలోని ఏడు మండలాల్లో దాదాపు 15 వేల హెక్టార్లలో జీడిపంట సాగవుతుండగా.. ఈ పంటపై సుమారు 12 వేల మంది రైతులు ఆధారపడి ఉన్నారు. ఏప్రిల్, మే నెలల్లో పంట చేతికందాల్సి ఉంది. అయితే ఈ ఏడాది సుమారు ఐదువేల హెక్టార్లలలో కూడా పంట పూర్తి స్థాయిలో పండిన దాఖలాలు లేవు. గతంలో ఈ సీజన్‌లో సుమారు రెండు నుంచి మూడు వేల టన్నుల వరకు జీడిపిక్కల దిగుబడి ఉండేది. ఈ ఏడాది వెయ్యి టన్నుల లోపు కూడా దిగుబడి
వచ్చే అవకాశం కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు. ప్రతి ఏటా ఒక్కో గిరిజన కుటుంబానికి జీడి పంట వల్ల రూ.50 వేల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఆదాయం వచ్చేది. ఈ ఏడాది రూ.20 వేలు కూడ వచ్చే అవకాశం లేదని రైతులు చెబుతున్నారు. ఎక్కువగా కుశిమి, కోడిశ, శంభాం, కె.గుమ్మడ, దోనుబాయి, పొల్ల, పెదరామ, మర్రిపాడు, పూతికవలస, చిన్నబగ్గ, పెద్దబగ్గ, కీసరజోడు, తదితర పంచాయతీల పరిధిలో జీడి ఎక్కువగా సాగవుతోంది. ఉద్యానవన పంటలను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో గతంలో ఐటీడీఏ కూడా జీడిమామిడి మొక్కలు సరఫరా చేసింది. అవి కూడా సరైన దిగుబడి ఇవ్వకపోవడంతో ఏం చేయాలో తెలియక రైతులు తలలు పట్టుకుంటున్నారు.