
వెళ్లకండి మాస్టారూ..
కొరాపుట్: బదిలీపై వెళ్లిపోతున్న హెచ్‌ఎంను వెళ్లనివ్వకుండా విద్యార్థుల కన్నీళ్లతో అడ్డుకున్నారు. ఆదివారం నబరంగ్‌పూర్ జిల్లా కొసాగుమడ సమితి బడఅమడ పంచాయతీకేంద్రంలో అక్కడి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రంజన్ కుమార్ బెహరాకు బదిలీ సందర్భంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది. రంజన్‌కుమార్ ఇక్కడి వారికి బాగా దగ్గరైపోయారు. చక్కగా చదువు చెబుతుండడంతో గ్రామస్తులు కూడా టీచర్‌ను ఇష్టపడేవారు. పాఠశాల ప్రాంగణం అంతా కూరగాయల మెక్కలు పెంచి వాటిని విద్యార్థులకు వితరణగా ఇచ్చేవారు. వ్యవసాయంపై అవగాహన కల్పించేవారు. సొంత ఖర్చుతో పిల్లలకు భోజనాలు కూడా పెట్టేవారు. పాఠశాలకు రాని పిల్లల ఇళ్ల వద్దకు వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించేవారు. గత ఏడాది ఈ బడికి ఉత్తమ పాఠశాల అవార్డు కూడా వచ్చింది. అలాంటి టీచర్‌కు బదిలీ కావడంతో విద్యార్థులతో పాటు స్థానికులు కూడా కంటతడి పెట్టారు.