
నరసరావుపేటరూరల్: తన కోడలను కిడ్నాప్ చేశారంటూ ఓ అత్త చేసిన హంగామాను డ్రామాగా పోలీసులు తేల్చారు. అత్తింట్లో వేధింపులు తట్టుకోలేక బంధువుల ఇంట్లో తలదాచుకున్న వివాహితను గుర్తించి విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. రూరల్ పోలీసుల కథనం ప్రకారం ఉప్పలపాడు సమీపంలోని జగనన్న కాలనీలో సింగులూరి నాగలక్ష్మి, తన కుమారుడు కృష్ణ, కోడలు లక్ష్మీప్రణతితో నివాసం ఉంటున్నారు. కృష్ణ, లక్ష్మీప్రణతికి ఐదేళ్ల క్రితం వివాహం కాగా తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
దీంతో లక్ష్మీప్రణతి పుట్టింటికి వెళ్లి వస్తూ ఉండేది. రెండునెలల తరువాత మంగళవారం అత్తింటికి వచ్చిన లక్ష్మీప్రణతిని అత్త, భర్త వేధించడం ప్రారంభించారు. భర్త తనపై చేయిచేసుకోవడంతో తట్టుకోలేక తన బంధువులకు లక్ష్మీప్రణతి సమాచారం ఇచ్చింది. బుధవారం రాత్రి బంధువులు జగనన్న కాలనీకి వచ్చి లక్ష్మీప్రణతిని తీసుకెళ్లారు. దీనిని కిడ్నాప్‌గా చిత్రీకరించిన నాగలక్ష్మి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వివరాలు నమోదు చేసుకున్న రూరల్ ఎస్‌ఐ బాలనాగిరెడ్డి లక్ష్మీప్రణతిని బంధువుల ఇంట్లో గుర్తించి విచారణ చేపట్టారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని అత్త, భర్త వేధింపులు తట్టుకోలేక బంధువుల ఇంట్లో తలదాచుకున్నానని స్పష్టంచేసింది. దీంతో పోలీసులు అత్త, భర్తను స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు.