జానపద సౌరభం : వసంత రాజీయం నాటకంలోని సన్నివేశం
పల్నాడు: ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నగరంలో నాటకోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సామాజిక సమస్యలపై ఎక్కుపెట్టిన చైతన్యాస్త్రాలుగా ఉన్న నాటికలు, నాటకాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతి ప్రదర్శనలోనూ నటీనటుల నటన ప్రేక్షకుల మనసులను హత్తుకుంది.
నటవిశ్వరూపం ‘నర్తనశాల’
ఇది మహాభారతం విరాట పర్వంలోని పాండవుల అజ్ఞాతవాస కథ. సీ్త్ర వ్యామోహంలో పడి అధర్మ మార్గాన నడిచే వారందరికీ అథఃపతనం తప్పదు. న్యాయమార్గాన నడిచేవారందరికీ ధర్మమే దైవమై నిలిచి కాపాడుతుందని ఈ నాటకం సందేశమిచ్చింది. రంగకృష్ణయ్య రచనకు, అర్జునరావు దర్శకత్వం వహించారు.
ఆలోచింపజేసిన ‘మూడు ప్రశ్నలు’
నేటి బాలల చదువుల తీరును ప్రశ్నించింది ఈ నాటిక. తల్లిండ్రులు ర్యాంకులు, మార్కులు అంటూ బాల్యాన్ని నలిపేస్తూ అనవసర పుస్తకాల మోతతో పిల్లలను మానసికంగా, శారీరకంగా బాధలకు గురి చేస్తున్న తీరును ప్రశ్నించి చదువుల తీరు తెన్నులను మార్చాలని చెప్పిన నాటిక ఇది. రచన ఆకురాతి భాస్కర చంద్ర, దర్శకత్వం వాసు. యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ విజయవాడ వారు ప్రదర్శించారు.
నాన్న ప్రాధాన్యతను చాటిన ‘ఇంద్రప్రస్థం’
ప్రేమ అనేది సృష్టిలో గొప్పదే, కానీ, ఆ ప్రేమలు ఆనందించే విధంగా ఉండాలే తప్ప అనాలోచితంగా పరుగెడితే జీవితంలో విలువలు నాశనం అవుతాయని తెలియ జెప్పిందీ నాటకం. ఆదర్శవంతమైన తండ్రి తన బిడ్డల పెళ్లి విషయంలో ఎలా నడుచుకోవాలో నాటకంలో కనిపించింది. నాన్న ఉంటేనే ఏ ఇల్లు అయినా ‘ఇంద్రప్రస్థం’లా వెలిగిపోతుందని తెలియజెప్పటమే నాటక ప్రధాన ఉద్దేశం. అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి ప్రదర్శన ఇది. స్నిగ్ధ రచనకు ఎన్.రవీంద్ర రెడ్డి దర్శకత్వం వహించారు.
ధర్మనిరతిని చాటిన ‘మహాభినిష్క్రమణ’
రామాయణ కథలో శ్రీరాముడి అవతార పరిసమాప్తికి సంబంధించిన కథలను తీసుకుని నాటికగా మలిచారు. ఈ కథా సారాన్ని చక్కగా నాటికగా ప్రదర్శించి తమ్ముడైనా ధర్మం తప్పని శ్రీరాముడి వ్యక్తిత్వాన్ని ఈ నాటిక ప్రకటించింది. ప్రఖ్య చిల్డ్రన్ ఆర్ట్ థియేటర్ తెనాలి వారి ప్రదర్శన ఇది. ఆరాధ్యుల తేజస్వీ ప్రఖ్య రచనకు అద్దేపల్లి లక్ష్మణశాస్త్రి దర్శకత్వం వహించిన యువ కళాకారుల పౌరాణిక నాటిక ఇది.
సందేశం, హాస్యం.. ‘పక్కింటి మొగుడు’
భార్యాభర్తలు సఖ్యతగా ఉంటేనే తమ ఆస్తి మనవడికి దక్కుతుందని, లేకుంటే ఆస్తంతా ఒక ఆశ్రమానికి చెందేలా వీలునామా రాసి కన్నుమూస్తారు ఓ తాత, బామ్మ. వీలునామాలో చూపిన రూ.రెండు కోట్ల ఆస్తిని కాపాడే క్రమంలో పడే కష్టాన్ని, సందేశం, హాస్యం రంగరించి ప్రదర్శించిన ఈ నాటిక ఆకట్టుకుంది. పండు క్రియేషన్స్ కొప్పోలు వారి ప్రదర్శన ఇది. రచన రామినేని నాగేశ్వర రావు, దర్శకత్వం బాలినేని నాగేశ్వరరావు వహించారు.
ప్రేమ కావ్యం.. ‘వసంత రాజీయం’
వసంతోత్సవాలలో నాట్యం చేసి రాజును మెప్పించి రాజనర్తకి అవుతుంది లకుమ. లకుమ నాట్యం భూమికగా ‘వసంత రాజీయం’ నాట్యశాస్త్ర గ్రంథం రాస్తూ ఆమె ప్రేమలో పడతాడు రాజు. ఆమె రాజును ప్రేమిస్తుంది. లకుమను అడ్డం పెట్టుకుని రాజును చంపాలని చూస్తుంటాడు గూఢచారి మహేంద్రుడు. రాజును చంపమని లకుమను ఒత్తిడి చేస్తాడు. మళ్లీ వసంతోత్సవాలలో వీరనాట్యం చేస్తూ తన్నుతాను పొడుచుకుంటుంది లకుమ.
రాజు దుఃఖించి, మహేంద్రుని బంధించి, వసంతరాజీయం అంకితమీయగా తీసుకుని తృప్తిగా లకుమ కన్నుమూస్తుంది. జానపద కథాంశాన్ని చక్కగా నాటకంగా మలచి చూపారు. శ్రీకళానికేతన్ హైదరాబాద్ వారు తడకమళ్ల రామచంద్రరావు రచనకు డాక్టర్ మారంరాజు రామచంద్ర రావు దర్శకత్వం వహించిన పద్య నాటకమిది. నంది నాటకోత్సవంలో నాటక ప్రదర్శనలను మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్, డీఆర్‌వో కె. చంద్రశేఖరరావు, ఆర్డీవో శ్రీకర్, తహసీల్దార్ సాంబశివరావు తిలకించారు.
నేడు నంది బహుమతుల ప్రదానం..
నంది నాటక పోటీల బహుమతి ప్రదానం సభ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ టి.విజయ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 23 నుంచి జరుగుతున్న నాటక పోటీల విజేతల వివరాలు ప్రకటించి, వారికి 73 స్వర్ణ, రజిత, కాంస్య నందులు ప్రదానం చేస్తారు. ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం, డాక్టర్ వైఎస్సార్ రంగస్థల పురస్కార గ్రహీతలకు అవార్డు ప్రదానం చేస్తారని తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment