
సాక్షి, పల్నాడు: రానున్న సార్వత్రిక ఎన్నికల్ని ప్రశాంత వాతావరణంలో, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో తీసుకుంటున్న చర్యల్ని గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరించారు. గత ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో 86 శాతం పోలింగ్ నమోదైందని, ఈసారి దాన్ని మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
ఓటర్లు చైతన్యంతో విలువైన ఓటును తప్పక వినియోగించుకోవాలని కోరారు. ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా, రీపోలింగ్ అవసరం లేకుండా పోలీస్‌శాఖతో సమన్వయం చేసుకుని పని చేస్తామని తెలిపారు. జిల్లాలో 1926 పోలింగ్ కేంద్రాలు ఉండగా, వాటిలో అవసరమైన ఫర్నీచర్, లైట్స్, ర్యాంప్, మరుగుదొడ్లు, తాగు నీటి వసతులు ఏర్పాటు చేశామన్నారు.
ఈ ఏడాది నుంచి హోమ్ ఓటింగ్..
రానున్న ఎన్నికల నుంచి హోమ్ ఓటింగ్ సదుపాయాన్ని కొత్తగా కల్పించనున్నామని కలెక్టర్ తెలిపారు. ఇందులో భాగంగా విభిన్న ప్రతిభావంతులు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి నుంచే తమ ఓటు హక్కు వినియోగించుకునే సదుపాయం ఉంటుందన్నారు. దీన్ని కర్నాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో విజయవంతంగా అమలు చేశారని తెలిపారు.
- జిల్లాలో 34,770 మంది విభిన్నప్రతిభావంతులు ఉన్నట్టు డీఆర్‌డీఏ శాఖ ద్వారా తెలుస్తుండగా, అందులో ఓటర్ నమోదులో 26,895 మంది మాత్రమే ఉన్నారని వివరించారు. మిగిలిన వారు కూడా నమోదు పూర్తి చేస్తే హోమ్ ఓటింగ్‌కు అర్హత పొందుతారని చెప్పారు.
- జిల్లాలో 80 ఏళ్లు నిండిన వృద్ధులు 25,590 మంది, 100 ఏళ్లు నిండిన వారు 110 మంది ఉన్నట్టు తెలిపారు.
- జిల్లాలో 1926 పోలింగ్ కేంద్రాలకు గాను 1926 ఈవీఎంల అవసరం కాగా మరో 20 శాతం యంత్రాలు అదనంగా అందుబాటులో ఉంచాల్సి ఉందన్నారు. జిల్లాలో ప్రస్తుతం 5,562 బ్యాలెట్ యూనిట్లు, 4,923 కంట్రోల్‌యూనిట్లు, 5,838 వీవీపాట్స్ అందుబాటులో ఉండటంతో ఈవీఎంలు సంతృప్తకరస్థాయి కన్నా అదనంగా ఉన్నాయని వివరించారు. మీడియా సమావేశంలో కలెక్టర్‌తోపాటు జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం పాల్గొన్నారు.
22న తుది ఓటరు జాబితా ప్రకటన
- ఈ నెల 22న తుది ఓటర్ జాబితాను ప్రకటించనున్నామని, అందుకు అవసరమైన చర్యలు నిబంధనల మేరకు తీసుకుంటున్నామని కలెక్టర్ శివశంకర్ తెలిపారు.
- ఇప్పటివరకు జిల్లాలో కొత్తగా ఓటు నమోదుకు ఫారం–6 దరఖాస్తులు 1,38,226 రాగా అందులో 1,08,507 మందికి కొత్తగా ఓటు హక్కు కల్పించామని చెప్పారు.
- ఓటు తొలగింపునకు ఫారం–7 దరఖాస్తులు 1,32,857 రాగా అందులో 1,01,370 ఓట్లను తొలగించామని పేర్కొన్నారు.
- ఇందులో చనిపోయిన వారు 60,515మంది, వలసవెళ్లిన వారు 29,078 మంది, రెండు ఓట్లు ఉన్నవారు 11,777 మంది ఉన్నట్టు తెలిపారు.
- జిల్లాలో 2024 జనాభా అంచనాల ప్రకారం 23,26,664 మంది ఉండగా అందులో జనవరి 1వతేదీనాటికి 17,09,011 మంది ఓటర్లు ఉన్నట్టు పేర్కొన్నారు.
- తుది జాబితా ఈ నెల 22వ తేదీ ప్రకటించినప్పటికీ కొత్త ఓటర్ల నమోదుకు, మార్పులకు నామినేషన్ చివరి రోజు వరకు అవకాశం ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment