ఎస్‌ఐ వేధింపులు తాళలేక..
సాక్షి, నరసరావుపేట : పోలీసుల వేధింపులు తాళలేక వినుకొండ రూరల్ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన ఎస్‌కే రఫీ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రఫీ వైఎస్సార్ సీపీ కార్యకర్త. గతంలో రఫీ తమను బూతులు తిట్టాడంటూ ఇటీవల గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పోలీసుల ద్వారా వినుకొండ స్టేషన్‌కి అతడిని పిలిపించారు. వారం రోజుల నుంచి ఎలాంటి కేసు నమోదు చేయకుండా రోజూ ఉదయాన్నే రఫీని పోలీస్ స్టేషన్‌కు పిలిపిస్తున్నారు, సాయంత్రం వరకు ఉంచుతున్నారు. దారుణంగా కొడుతున్నారు. మంగళవారం కూడా పోలీస్‌స్టేషన్‌కు రావాలని ఎస్‌ఐ సత్యనారాయణ ఫోన్ చేశాడు. టీడీపీ నాయకుల కాళ్లు పట్టుకుని క్షమాపణ అడగాలని, వాళ్లు క్షమించారని తనకు చెబితేనే వదిలిపెడతామని ఎస్‌ఐ రఫీని భయపెట్టారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రఫీ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానిక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న భార్య ఫాతిమా, తల్లి శిలార్‌బీలతో పాటు పలువురు గ్రామస్తులు ఆస్పత్రి వద్దకు చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయం చేయాల్సిన పోలీసులే ఈ విధంగా ప్రవర్తించడాన్ని తప్పుబట్టారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ ఘటనపై పూర్తి విచారణ చేయించి బాధితులకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
వ్యక్తి ఆత్మహత్యాయత్నం టీడీపీ నాయకుల ప్రోద్బలంతో ఖాకీల అరాచకం
Comments
Please login to add a commentAdd a comment