
పురుగుమందు తాగి మహిళ ఆత్మహత్య
బొల్లాపల్లి: పురుగుమందు తాగిన మహిళ చికిత్స పొందుతూ మృతిచెందింది. బండ్లమోటు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొల్లాపల్లి మండలం కండ్రిక గ్రామానికి చెందిన బైలడుగు రమణ(45) మద్యానికి బానిసైన భర్తను బెదిరించేందుకు గత నెల 29వ తేదీన పురుగుల మందు తాగింది. వెంటనే బంధువులు వినుకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది. మృతురాలికి ఇరువురు కుమార్తెలు ఉన్నారు. భర్త చిన్న బాదరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్‌ఐ జె.భాస్కరరావు తెలిపారు.