
మైనారిటీలకు అండగా జగనన్న
పట్నంబజారు(గుంటూరుఈస్ట్) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మైనారిటీలకు అన్ని వేళలా అండగా నిలబడతారని, వక్ఫ్ బిల్లుకు సంబంధించి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయటం ద్వారా మరో సారి సుస్పష్టమైందని పార్టీ గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా చెప్పారు. లోక్‌సభలో వ్యతిరేకించి.. రాజ్యసభలో మద్దతునిచ్చారని పిచ్చిపట్టిన వ్యాఖ్యలు చేస్తున్న కొంత మంది పచ్చ మీడియాకు పిటిషన్ దాఖలతో బుద్ధి వచ్చినట్టు అయిందన్నారు. గుంటూరులోని తన కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దివంగత ముఖ్య మంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లిం మైనారిటీలకు 4శాతం రిజర్వేషన్ కల్పిస్తే, జగనన్న వారికి అన్ని విధాలుగా అండగా ఉంటున్నారన్నారు. సీఎంగా ఉన్న సమయంలో సైతం ఎన్‌ఆర్‌సీని సైతం వ్యతిరేకించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మైనారిటీల పక్షాన పోరాడుతున్న జగనన్నకు యావత్తూ మైనారిటీలు మొత్తం కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
ఎమ్మెల్యే నసీర్‌అహ్మద్ పార్టీలకు అతీతంగా రాజీనామా చేయగలరా...?
గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ఎండీ నసీర్‌అహ్మద్ రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా రాజీనామా చేయగలరా అని నూరిఫాతిమా ప్రశ్నించారు. గత వారం క్రితం ప్రభుత్వానికి మద్దతుగా ఒక మాట చెప్పి, గత శుక్రవారం జరిగిన నిరసన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని తాను కూడా బిల్లుకు వ్యతిరేకమని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎమ్మెల్యే నసీర్‌అహ్మద్ అసలు ఈ బిల్లు ఏవిధంగా మంచిదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనకు అవేమి పట్టవని, కేవలం సీటు కోసం తాపత్రయం పడుతున్నారని, కేవలం మాట చెప్పటం కాదని.. దమ్ముంటే ఆ మాట మీద నిలబడాలని సవాల్ విసిరారు. ఎన్‌ఆర్‌సీ బిల్లుకు వ్యతిరేకంగా ఆ రోజున మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్‌ముస్తఫా, పూర్తిస్థాయిలో అంశాన్ని జగనన్నకు వివరించి దానిని వ్యతిరేకించేలా చేశారని, ఇప్పుడు ఎమ్మెల్యే నసీర్ చంద్రబాబుకు చెప్పి బిల్లుకు వ్యతిరేకంగా పోరాడమని చెప్పగలరా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి మైనారిటీలతో ఎటువంటి అవసరం లేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే నసీర్‌అహ్మద్ బిల్లు అంశంపై డిబేట్‌కు రావాలని, తాను ఒక సాధారణ మైనారిటీ మహిళగా వస్తామని, చర్చకు సిద్ధమో కాదో చెప్పాలన్నారు. కచ్చితంగా వైఎస్సార్ సీపీ స్టాండ్ ఒక్కటేనని, వక్ఫ్ బిల్లు రద్దు చేయటమేనన్నారు. వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి ప్రజల కోసమే పాటుపడుతుందన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ మైనారిటీ నేతలు పలువురు పాల్గొన్నారు.
వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్‌పై మైనారిటీల్లో హర్షం ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ రాజకీయాలు, పార్టీలకు అతీతంగా రాజీనామా చేయగలరా? వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా