
రైల్వే యూజర్స్ కన్సల్‌టేటివ్ కమిటీ సభ్యుడిగా జూలకంటి
పిడుగురాళ్ల: దక్షిణ మధ్య రైల్వే జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్‌టేటివ్ కమిటీ మెంబర్‌గా పిడుగురాళ్లకు చెందిన పిడుగురాళ్ల రైల్వే ప్యాసింజర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జూలకంటి శ్రీనివాసరావు నియమితులయ్యారు. బుధవారం రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌లోని ప్రధాన కార్యాలయం రైల్ నిలయం డీజీఎం(జీ), జెడ్‌ఆర్‌యూసీసీ కార్యదర్శి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
కళా పురస్కారాలు ప్రదానం
తెనాలి: డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి నాటక కళాపరిషత్ జాతీయస్థాయి చతుర్ధ ఆహ్వాన నాటికల పోటీల్లో అయిదోరోజైన బుధవారం తెలుగు నాటకరంగ దినోత్సవాన్ని నిర్వహించారు. పట్టణానికి చెందిన సాంఘిక, పౌరాణిక పద్యనాటక కళాకారులు బద్దుల తిరుపతయ్య, దేవిశెట్టి కృష్ణారావు, చెన్నం సుబ్బారావును సంస్థ సభ్యులు ఘనంగా సత్కరించి, కళాపురస్కారాన్ని ప్రదానం చేశారు. తొలుత గుంటూరుకు చెందిన ప్రముఖ కూచిపూడి నృత్యగురువు సరిత శిష్యబృందం, ఆరిశెట్టి ఐశ్వర్య శిష్యబృందం, యనమదల రీతిక, శవ్వా గ్రీష్మశ్రీలు కూచిపూడి, జానపద నృత్యాంశాలను ప్రదర్శించారు. తెనాలి కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షుడు ఆరాధ్యుల కన్నా, అధ్యక్షుడు అద్దేపల్లి లక్ష్మణశాస్త్రి పర్యవేక్షించారు. ఆరో రోజైన గురువారం సాయంత్రం కళాంజలి, హైదరాబాద్ వారి ‘అన్నదాత’, సహృదయం ద్రోణాదుల వారి ‘వర్క్ ఫ్రమ్ హోం’ నాటికల ప్రదర్శనలు వుంటాయని తెలియజేశారు.
యార్డుకు 1,59,032 బస్తాల మిర్చి
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు బుధవారం 1,59,032 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,57,640 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.13,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.9,800 నుంచి రూ.13,500 వరకు లభించింది. తాలు రకం మిర్చి రూ.4,500 నుంచి రూ.6,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 76,896 బస్తాలు నిల్వ ఉన్నాయి.

రైల్వే యూజర్స్ కన్సల్‌టేటివ్ కమిటీ సభ్యుడిగా జూలకంటి

రైల్వే యూజర్స్ కన్సల్‌టేటివ్ కమిటీ సభ్యుడిగా జూలకంటి