
ఉల్లాస్ రెండో విడత లక్ష్యం 30 వేల మంది
నరసరావుపేట: గతేడాది అందరికీ అక్షరాస్యత (ఉల్లాస్) కార్యక్రమం మొదటి విడత ద్వారా జిల్లాలో చదవడం, రాయడం రాని 10,707 మందిని అక్షరాస్యులను చేశామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు వెల్లడించారు. 2025–26లో 30 వేల మందిని విధాన, ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యులను తయారు చేయాలని అధికారులకు లక్ష్యంగా నిర్దేశించామన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం ఉల్లాస్ పథకంపై జిల్లాస్థాయి కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ.. మొదటి ఫేజ్‌లో కేవలం గ్రామీణ ప్రాంతాల్లో వయోజన విద్య కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. రెండో దశలో పట్టణ ప్రాంతాల్లోని వారికీ తరగతులు నిర్వహించాలని సూచించారు. ఆ మేరకు మున్సిపాలిటీల్లో ఉల్లాస్ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. నిరక్షరాస్యులను గుర్తించి నమోదు చేయాలన్నారు. సెర్ప్, మెప్మా అధికారులు ప్రతి పది మంది అభ్యాసకులకు ఒక విద్యా వలంటీర్ చొప్పున నియామకాలు చేపట్టాలని సూచించారు. జిల్లాలోని ప్రతి ఒక్కరూ రాయడం, చదవడం, ఆర్థిక లావాదేవీలు చేయగలిగేలా శిక్షణ ఇవ్వాలన్నారు. జిల్లా వయోజన విద్య అధికారి జగన్‌మోహన్‌రావు, డీఈవో ఎల్.చంద్రకళ, డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి, గ్రామ–వార్డు సచివాలయాల నోడల్ అధికారి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
తొలి దశలో 10,164 మందికి లబ్ధి
జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు