
గుక్కెడు నీటి కోసం తప్పని కష్టాలు
దొడ్లేరు(క్రోసూరు): గ్రామంలో వాటర్ ఓవర్ హెడ్ ట్యాంకులున్నా, చెరువులో నీళ్లు పుష్కలంగా వారికి గుక్కెడు నీరు మాత్రం రావడం లేదు. జలజీవన్ మిషన్ ద్వారా నీరు సరఫరా చేయాల్సి ఉన్నా పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది. మండుటెండల్లో నీరు దొరక్క బజారులో బోరు పంపు వేయించేందుకు ప్రయత్నించగా పోలీసులను పిలిపించి అడ్డుకోవటంతో వారు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని దొడ్లేరు గ్రామంలోని దండుబజారు వాసుల దుస్థితి ఇది. ఇప్పటి వరకు వీధిలో ఉన్న బావి నుంచి నీరు తెచ్చుకునేవారు. బావి యజమాని ప్రస్తుతం వారిని రానీయటం లేదు. దీంతో వీధిలో బోరు పంపు వేసేందుకు గురువారం ఉపక్రమించారు. 20 అడుగులు తవ్వాక ఇంటి యజమాని ఒకరు తమ స్థలంలో బోరు వేస్తున్నారని ఫిర్యాదు చేయటంతో పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. బోరు పంపు వేయనీయలేదు. దీంతో అక్కడి మహిళలు ఆందోళనకు దిగారు. గ్రామంలోని ప్రధాన రహదారిపై ఆందోళన చేశారు. పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని పోలీసులు నచ్చజెప్పారు.
దొడ్లేరు గ్రామంలోని దండుబజారు వాసుల ఆందోళన
ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీ అధికారుల తీరుపై ఆవేదన