
హాస్య నట మాంత్రికుడు షఫీ ఉజ్మా
చిలకలూరిపేట: నవరసాలలో కష్టమైనది హాస్య రసం. దాన్ని తన సహజ నటనతో ప్రేక్షకుల మోముల్లో నవ్వుల పువ్వుల్ని అవలీలగా పూయించగల విలక్షణ నటుడు షేక్ షఫీ ఉజ్మా. కామెడీ నాటకాలంటే ముందుగా గుర్తొచ్చేది షఫీనే. ఆయన రంగస్థల కళాకారుడే కాదు దర్శకుడు కూడా. చిలకలూరిపేట పట్టణానికి చెందిన షఫీ నాటకరంగంలో తన జీవితాన్ని హాస్య భూమికగా మలుచుకున్నాడు. పట్టణానికి చెందిన అబ్దుల్‌రజాక్, నజీమున్నీసా దంపతుల కుమారుడైన షఫీ తన హాస్య నాటికల ద్వారా తెలుగు నాటక రంగాన్ని వినోదభరితంగా తీర్చిదిద్దాడు. ప్రతి నాటికలోనూ హాస్యాన్ని ఓ సామాజిక సందేశంగా మార్చిన షఫీ, ప్రేక్షకులను కేవలం నవ్వించడం, అలరించడమేకాదు..ఆహుతుల్ని ఆలోచింపజేస్తుంది అతని నటన. షఫీ నటించిన ప్రతి పాత్ర, ప్రతి సంభాషణలోనూ విశేషమైన స్వాభావికత్వం, చిరునవ్వు పండించే మాంత్రికతత్వం సహజంగా ఉంటుంది. కాబట్టే తాజాగా ప్రభుత్వం ప్రకటించిన కందుకూరి జిల్లా పురస్కారాన్ని గర్వంగా అందుకున్నాడు.
స్వీయ దర్శకత్వంతో పాటు నటించిన నాటికలివే...
తొలి నాటిక ఛాన్స్ నుంచి మొదలైన షఫీ కళా పయనం వాయిదాల పెళ్లి, కాకి సందేశం, హ్హాచ్చ్ , వడ్లగింజలో బియ్యపు గింజ, నల్లకోడి తెల్ల గుడ్డు , పోవోయీ అనుకోని అతిథి, అక్క అలుగుడు చెల్లి సణుగుడు , ఆలీతో సరదాగా, హర్షం ఋతువు, ప్రేమ పొత్తిళ్లలోకి, హరిశ్చంద్రుడే అబద్ధమాడితే! , వర్క్ ఫ్రం హోమ్, ఏడనున్నాడో ఎక్కడున్నాడో, వాస్తు బాబోయ్ వాస్తు, తగునా ఇది భామా, భూమి గుండ్రంగా ఉంది, నిజాయితీ, బావా బావా పన్నీరు వంటి హాస్య నాటికలన్నీ షఫీ నటించి, దర్శకత్వం వహించి విశేష ప్రాచుర్యం పొందినవే.
నటప్రస్థానానికి అందిన స్నేహహస్తం
షఫీ కళా ప్రయాణానికి తోడ్పడిన వారు ఉన్నారు. వారి స్ఫూర్తిదాయక మాటలతో పాటు ప్రముఖ హాస్య నాటక రచయిత అద్దేపల్లి భరత్‌కుమార్, కొత్త శివ, వంకాయలపాటి ప్రసాద్, ఆళ్ల హరిబాబు, అంబటి బాలస్వామి, వి. నాగేశ్వరరావు, నటీమణి లహరి సంపూర్ణ మద్దతు నిచ్చారు. దీనికి తోడు షఫీ నిబద్ధత, తోటి కళాకారులు సహకారం వెరసి ఆయన కలల సాధనకు ఎంతో దోహదపడ్డాయి.
కందుకూరి పురస్కారం అందుకున్న షఫీ నట ప్రస్థానం రంగస్థల హాస్య నాటికల దర్శక, నటుడిగా కీర్తి స్వీయ దర్శకత్వంలో ప్రదర్శించిన నాటికలకు ప్రశంసల జల్లులు ఆలీతో సరదా నాటిక రాష్ట్రవ్యాప్తంగా 74 చోట్ల ప్రదర్శనలు మే 1న చిలకలూరిపేటలో 75వ ప్రదర్శనకు సన్నాహాలు
ఆ కళారూపం ఓ మైలురాయి
ఇక ’ఆలితో సరదాగా’ నాటిక షఫీ నట ప్రస్థానానికి మైలురాయిగా నిలిచింది. ఆయన నాటికల్లో అత్యధిక ప్రదర్శనలకు నోచుకున్న నాటిక ఇదే కావడం విశేషం. ఇప్పటి వరకు రాష్ట్రంలోని 74 పరిషత్తుల్లో ప్రదర్శనలు, ప్రశంసలకు నోచుకుంది. భిలాయ్, శ్రీకాళహస్తి, ఏలూరు, ద్రాక్షారామం, రావులపాలెం, విజయవాడ వంటి పది ప్రముఖ పరిషత్తుల్లో ఉత్తమ బహుమతుల్ని సాధించింది. ఇదే నాటిక తన జన్మస్థలంలో ఈ ఏడాది మే 18న తిరిగి 75వ ప్రదర్శనకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఒక నాటిక అనేక చోట్ల అనేకమార్లు ప్రదర్శనలకు నోచుకోవడం అంటే ఆషామాషీ కాదు.

హాస్య నట మాంత్రికుడు షఫీ ఉజ్మా