వక్ఫ్‌ బోర్డు ముస్లింల హక్కు | - | Sakshi
Sakshi News home page

వక్ఫ్‌ బోర్డు ముస్లింల హక్కు

Published Sat, Apr 19 2025 9:24 AM | Last Updated on Sat, Apr 19 2025 9:24 AM

వక్ఫ్

వక్ఫ్‌ బోర్డు ముస్లింల హక్కు

నకరికల్లు: ముస్లింల హక్కు అయిన వక్ఫ్‌ బోర్డును విచ్ఛిన్నం చేసే బిల్లును ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నట్లు ప్రముఖ న్యాయవాది షేక్‌ అబ్దుల్‌ రజాక్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన వక్ఫ్‌ బిల్లును వ్యతిరేకిస్తూ జాతీయ జెండాలు, నల్ల జెండాలతో ముస్లింలు శుక్రవారం నకరికల్లులో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. స్థానిక వై.జంక్షన్‌లో నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని గుండ్లపల్లి, నకరికల్లు, కుంకలగుంట తదితర గ్రామాలతో పాటు పలు గ్రామాల్లోని ముస్లింలు స్వచ్ఛందంగా పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. వక్ఫ్‌ బిల్లుకు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముందుగా గుండ్లపల్లిలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్‌ రజాక్‌ మాట్లాడుతూ ముస్లిం పెద్దలు, అప్పటి రాజులు దానంగా, ధర్మంగా ఇచ్చిన కోట్ల విలువ కలిగిన ఆస్తులకు 1913లో ఒక చట్టంతో నేటి వరకు రక్షణ కల్పించుకున్నట్లు తెలిపారు. ముస్లింల రక్షణ పేరుతో దుర్మార్గమైన చట్టాన్ని అర్ధరాత్రి కేంద్రం అమల్లోకి తీసుకు వచ్చిందని విమర్శించారు. ముస్లింలకు అన్యాయం చేస్తే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. పలువురు ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ వక్ఫ్‌ ఆస్తులు ముస్లింలకు అనాదిగా వస్తున్న హక్కు అన్నారు. యావత్‌ ముస్లింలు వ్యతిరేకిస్తున్న దుర్మార్గపు బిల్లును కేంద్రం వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బిల్లును వెనక్కు తీసుకునే వరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తూనే ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో చింతపల్లి ఫకీర్‌ అహ్మద్‌, కరాలపాటి వలి, వినుకొండ సుభాని, కరిముల్లా, మస్తాన్‌వలి, షేక్‌ సలీల్‌, బండల జాను, షేక్‌ బాజి, ఇస్మాయిల్‌, జానీ బాషా, న్యాయవాది జిలాని, ఖాజావలి, రహమాన్‌, చాంద్‌ బాషా, మొహమ్మదా, సైదా, కాలేషా పాల్గొన్నారు.

వక్ఫ్‌ సవరణ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి

సత్తెనపల్లి: కేంద్ర ప్రభుత్వం ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా ఇటీవల తెచ్చిన వక్ఫ్‌ సవరణ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని ముస్లిం మత పెద్దలు డిమాండ్‌ చేశారు. వక్ఫ్‌ బోర్డు బిల్లు సవరణకు వ్యతిరేకంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో శుక్రవారం ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో భారీ శాంతి నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ మైనార్టీ హక్కులకు భంగం కలిగించేలా ఉన్న ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ఖండించారు. నూతన చట్టంలో వక్ఫ్‌ నిర్వచనాన్ని మార్చారని తెలిపారు. కొన్ని శతాబ్దాలుగా ఉన్న మసీదులు, ముస్లిం శ్మశాన వాటికలు, దర్గాలు, ముస్లిం మత ప్రదేశాలన్నీ కూడా ఎలాంటి డీడ్స్‌ లేకపోయినా వక్ఫ్‌ బోర్డుల పరిధిలో కొనసాగుతూ ఆస్తులుగా ఉన్నాయని వివరించారు. నూతన చట్టం ప్రకారం వాటన్నిటిపై బోర్డుకున్న హక్కు తొలగి పోతుందని, దీని ద్వారా ఆస్తుల స్వాధీనం లేదా పునర్‌ వర్గీకరణకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. దీంతో లెక్కలేనన్ని చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకంగా నిలిచే ప్రదేశాలను కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. నూతన చట్టంలో వక్ఫ్‌ బోర్డు సీఈవోగా ముస్లిం వ్యక్తే ఉండాలన్న నిబంధనను తొలగించడంతో పాటు సెంట్రల్‌ వక్ఫ్‌ కౌన్సిల్‌, వక్ఫ్‌ బోర్డులో ముస్లిమేతరులకు అవకాశం కల్పిస్తారని చెప్పారు. ఇవి తమ హక్కులకు భంగం కలిగించడమేనని, మతాల మధ్య సామరస్యాన్ని దెబ్బతీయట మేనని ధ్వజమెత్తారు. ముస్లింల ప్రాథమిక హక్కుల కల్పనకు వ్యతిరేకంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వక్ఫ్‌ సవరణ చట్టంలో చేసిన 14 సవరణలను వెంటనే ఉపసంహరించుకోవాలని, మైనార్టీలపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని డిమాండ్‌ చేశారు. హిందూ, ముస్లింల ఐక్యత వర్ధిల్లాలి.. వక్ఫ్‌ పరిరక్షణకు ముస్లింల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. సత్తెనపల్లిలోని జాతీయ రహదారిపై కదం తొక్కిన ముస్లింలు నరసరావుపేట రోడ్‌లోని చెక్‌పోస్ట్‌ సమీపంలో గల మసీదు నుంచి ఆర్టీసీ బస్టాండ్‌ వరకు శాంతి నిరసన ర్యాలీ నిర్వహించారు. తిరిగి తాలూకా సెంటర్‌కు చేరుకొని అక్కడ బహిరంగ సభ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ కె.ఎస్‌. చక్రవర్తికి వినతి పత్రాన్ని అందించారు. ముస్లింల శాంతి నిరసన ర్యాలీకి న్యాయవాది జొన్నలగడ్డ విజయ్‌కుమార్‌ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో పెద్దఎత్తున ముస్లింలు, మత పెద్దలు, పార్టీలకు అతీతంగా ముస్లిం నాయకులు పాల్గొన్నారు.

బిల్లును నిరసిస్తూ నిరసన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు జాతీయ రహదారిపై కదం తొక్కిన ముస్లింలు సత్తెనపల్లి చెక్‌పోస్ట్‌ నుంచి బస్టాండ్‌ వరకు భారీ శాంతి ర్యాలీ

వక్ఫ్‌ బోర్డు ముస్లింల హక్కు 1
1/1

వక్ఫ్‌ బోర్డు ముస్లింల హక్కు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement