
విద్యతోపాటు మహిళల అభివృద్ధిలో భాగస్వామి
పిడుగురాళ్ల: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యతోపాటు మహిళల అభివృద్ధికి కూడా భాగస్వామి అవుతుందని సీఎస్‌ఆర్ డైరెక్టర్ బి.బబిత అన్నారు. పట్టణ శివారులోని కొండమోడులో ఏర్పాటు చేసిన ఉచిత జూట్ ఉత్పత్తుల తయారీ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆమె మాట్లాడుతూ ఉచిత శిక్షణ పొందిన మహిళలకు ధ్రువీకరణ పత్రాలను అందజేయటం జరుగుతుందని పేర్కొన్నారు. శిక్షణను వదిలేయకుండా మహిళలు స్వయం ఉపాధికి ఉపయోగించుకోవాలని ఆమె కోరారు. ఈ నెల రోజుల శిక్షణ తరగతులు 15 రకాల ఉత్పత్తులను శిక్షణ ద్వారా తయారు చేయటం నేర్పించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఎస్‌ఆర్ సీనియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మండూరు వెంకటరమణ, శిక్షకురాలు పి.దుర్గా, పీఎస్‌ఆర్ డిగ్రీ కాలేజీ డైరెక్టర్లు కె.నరసింహారావు, బాడిస మస్తాన్ పాల్గొన్నారు.
భార్యపై బ్లేడుతో దాడిచేసిన భర్త అరెస్ట్
క్రోసూరు: క్రోసూరు బోయకాలనీలో శుక్రవారం భార్యపై అనుమానంతో బ్లేడుతో దాడి చేసిన భర్త చర్ల శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం కోర్టులో హాజరుపరచగా 15 రోజులు రిమాండ్ విధించినట్లు స్టేషన్ రైటర్ దాసు తెలిపారు.