
‘ప్రభుత్వ’ విద్యార్థులు గొప్పగా రాణించారు
జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
నరసరావుపేట: పదవ తరగతి పరీక్షలలో జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు అసాధారణ ప్రతిభ కనబరిచారని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల పరిధిలో 598 మార్కులు జిల్లా నుంచే నమోదయిందన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత విద్యా సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో 18వ స్థానంలో ఉన్న పల్నాడు జిల్లా ఈ ఏడాది 11వ స్థానానికి ఎగబాకిందన్నారు. అద్భుత ఫలితాలు సాధించడంలో కృషిచేసిన డీఈఓ చంద్రకళ, విద్యా శాఖ సిబ్బంది, ఉపాధ్యాయులను అభినందించారు. రానున్న విద్యా సంవత్సరంలో మరింత గొప్ప ఫలితాలు సాధించేలా పని చేయాలన్నారు. డీఈఓ చంద్రకళ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ తీసుకున్న చర్యల వల్లే 2024–25 విద్యా సంవత్సరంలో పల్నాడు జిల్లా మెరుగైన ఫలితాలు సాధించగలిగిందని అన్నారు. టాపర్లకు, చదువుల్లో వెనకబడిన విద్యార్థులకు వేరు వేరుగా లక్ష్యాలు నిర్దేశించుకుని పరీక్షలకు సన్నద్ధం చేశామన్నారు. భవిష్యత్తులో 7,8 తరగతుల నుంచి చదువులో వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్న కలెక్టర్ ఆదేశాలను పాటించనున్నామన్నారు.