
కవి కత్తి పద్మారావుకు ఘన సన్మానం
పొన్నూరు: పట్టణంలోని లుంబినీ వనం అంబేడ్కర్ రీసెర్చ్ సెంటర్‌లో దళిత మహాసభ పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ నేతల రమేష్ ఆధ్వర్యంలో కవి డాక్టర్ కత్తి పద్మారావు, మాతా రమాబాయి అవార్డు గ్రహీత కత్తి స్వర్ణ కుమారిలను శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ కత్తి పద్మారావు, స్వర్ణ కుమారి అనేక ఉద్యమాలను నీతి, నిజాయతీగా చేసిన త్యాగమూర్తులని కొనియాడారు. కారంచేడు, చుండూరు, పిప్పర, కొత్తకోట, దంతారి, లక్ష్మీపేట వరకు ఎన్నో ఉద్యమాలు చేసిన పోరాట యోధులని పేర్కొన్నారు. దళిత మహాసభ ఆధ్వర్యంలో వారిని సన్మానించడం ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. 1989 ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ తెచ్చిన ఘనత పద్మారావుకే దక్కుతుందన్నారు. దాని వల్ల దళిత బహుజనులకు రక్షణ, సంక్షేమం అందిందని, ప్రత్యేక కోర్టులు ఏర్పడ్డాయని అభినందించారు. కార్యక్రమంలో దళిత మహాసభ ప్రతినిధులు చిగురుపాటి రత్నాకర్‌రావు, నేతలు భలేస్వామి, మాకారపు రాజు, గద్దె అచ్యుతరావు, పీఆర్వోలు గేరా ప్రసన్న కుమారి, శ్యామల, జొన్నలగడ్డ రాణిి పాల్గొన్నారు.