సాలూరు: టీడీపీ సాలూరు నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించిన సంధ్యారాణి ఎస్టీ కాదని, ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయిస్తామని న్యాయవాది, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం న్యాయ సలహాదారు రేగు మహేశ్వరరావు స్పష్టం చేశారు. సాలూరు పట్టణంలో విలేకరులతో మంగళవారం మాట్లాడారు. సంధ్యారాణి కులవివాదంపై ఆదివాసీ వికాస పరిషత్ సంఘం నాయకులు కలెక్టర్ గ్రీవెన్స్‌లో సోమవారం ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. ఆమె కుల వివాదంపై ఇప్పటికే పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. ఆమె రాజకీయనాయకురాలు కావడం, రాజకీయ ఒత్తిళ్లతో సరిగా దర్యాప్తు జరగలేదని ఆరోపించారు.
ఈ క్రమంలో ఆమె కుల వివాదంపై దర్యాప్తు చేయాలని కోరుతూ తాము హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. మక్కువ మండలం మరిపివలస గ్రామం, కొప్పలవెలమ కులానికి చెందిన అమరాపు సిమిడినాయుడు, పార్వతమ్మల కుమార్తె సంధ్యారాణి అని పేర్కొన్నారు. తన తండ్రి మాజీ ఎమ్మెల్యే జన్ని ముత్యాలుగా పేర్కొంటూ ఎస్టీ కులధ్రువీకరణ పత్రం పొంది చలామణి అవుతున్నారని ఆరోపించారు. సంధ్యారాణి తల్లి పార్వతమ్మ, మాజీ ఎమ్మెల్యే జన్ని ముత్యాలును రెండో వివాహం చేసుకుందని ఆమె చెబుతున్న వాదన సరైనదే అయినా.. ఆమె ఎస్టీ కులధ్రువీకరణ పత్రం కేవలం విద్యకు మాత్రమే పరిమితమవుతుందన్నారు.
మిగిలిన పదవులు, ఉద్యోగాలకు వర్తించదన్నారు. దీనిపై డీఎల్‌సీ కమిటీతో పూర్తిస్థాయి విచారణ జరిగేలా ఆదేశాలు జారీచేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. విజయనగరం కలెక్టర్ 2008లో ఓ కేసుకు సంబంధించి తండ్రి ఎస్టీ గదబ అయినప్పటికీ, తల్లి ఓసీ బ్రాహ్మణ అయినందున భార్య, ఆమె పిల్లలు ఎస్టీ గదబ ఆచార వ్యవహారాలు ఆచరించనందున, పిల్లలు ఎస్టీలుగా పరిగణించడానికి వీల్లేదని తీర్పునిచ్చారని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment