దాహం కేకలు
గిరిశిఖర
గ్రామాల్లో
సీతంపేట:
ఏజెన్సీలో తాగునీటి కష్టాలు ఆరంభమయ్యాయి. కొండ శిఖర గ్రామాల్లో దాహం కేకలు వినిపిస్తున్నాయి. బిందెడు నీటికోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన దుస్థితి నెలకుంది. ఏప్రిల్, మే నెలల్లో ఎదుర్కొవాల్సిన నీటి ఎద్దడి ఇప్పటి నుంచే ఆరంభం కావడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా నీటిసేక రణలో నిమగ్నమవుతున్నారు.
జేజేఎం పనులు జరిగేదెప్పుడు...
జల్‌జీవన్ మిషన్ పనులు ముందుకు సాగడం లేదు. గత ప్రభుత్వ హయాంలో రూ.10.77 కోట్ల తో 505 పనులు మంజూరయ్యాయి. ప్రభుత్వం మారడంతో ఇవి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉన్నాయి. దీంతో ఇంటింటికీ కుళాయి నీరు ఈ వేసవిలో కూడా సరఫరా అయ్యే సూచనలు కనిపించడం లేదు. ఏజెన్సీలో 556 గ్రామా లున్నాయి. సుమారు 700లకు పైగా బోర్లు, 400 వరకు బావులు, మరో 150 సోలార్ రక్షిత పథకాలున్నాయి. వీటిలో సుమారు వందకుపైగా గ్రామా లు ఏటా తీవ్ర నీటిఎద్దడి ఎదుర్కొంటున్నాయి. దోనుబాయి, దారపాడు, పూతికవలస, కడగండి, మండ, నాయుడుగూడ, పెదరామ, దోనుబాయి, కిల్లాడ, పొల్ల, శంభాం, కుశిమి పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో ఎక్కువగా నీటి ఎద్దడి ఉంది. వీటికి శాశ్వత పరిష్కారం లభించని పరిస్థితి. నీటికోసం గెడ్డలపై ఆధారపడుతున్నారు. జీవగెడ్డలు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలోనే అడుగంటి పోతున్నాయి. ఏం చేయాలో తెలియని స్థితిలో గిరిజనులు ఉన్నారు. కొండశిఖర గ్రామాలతో పాటు మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్నావారికి అరకొర మంచినీరు లభిస్తోందని గిరిజనులు తెలిపారు. శాశ్వత పరిష్కారం ఎండమావిగా మారిందంటూ వాపోతున్నారు.
అడుగంటుతున్న జీవగెడ్డలు
గిరిజనానికి తప్పని అవస్థలు
సుదూర ప్రాంతాల నుంచి నీరు తెచ్చుకుంటున్న గిరిజనులు
వందకు పైగా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి
శాశ్వత పరిష్కారం నిల్
చిత్రంలో బావి నుంచి నీరు సేకరిస్తున్నది సీతంపేట మండలం రంగంవలస వాసులు. గ్రామానికి 800 మీటర్ల దూరంలో తాగునీటి బావి ఉంది. గతంలో గిరిజనులు సొంత ఖర్చులతో పైప్‌లైన్ వేసి మోటారు ఆధారంగా తాగునీరు సరఫరా చేసుకునేవారు. ఇప్పుడు మోటారు పనిచేయకపోవడంతో బావి వద్దకు వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోంది. రోజులో సగం సమయం నీటిని తెచ్చుకునేందుకే సరిపోతుందని మహిళలు వాపోతున్నారు. బావి నీరు అడుగంటడంతో ఆందోళన చెందుతున్నారు.
చిత్రంలో కనిపిస్తున్న మహిళలు, వృద్ధులు, పిల్లలది సీతంపేట మండలంలోని ఎగువదరబ గ్రామం. స్థానికంగా తాగునీటి సదుపాయం లేదు. గతంలో రసూల్‌పేట నుంచి మోటార్ పెట్టి పైపుల సాయంతో నీరు గ్రామానికి సరఫరా చేసేవారు. ఆ సదుపాయం ఇప్పుడు నిలిచిపోయింది. గ్రామంలో నివసిస్తున్న 37 కుటుంబాల వారు సుమారు రెండున్నర కిలోమీటర్ల దూరంలోని గొయిది గెడ్డ నుంచి ప్రతిరోజు తాగునీరు తెచ్చుకుంటున్నారు. గెడ్డనీరు తాగుతుండడంతో జ్వరాల బారిన పడుతున్నామని వాపోయారు.
దాహం కేకలు
Comments
Please login to add a commentAdd a comment