ఎన్నికల విధుల్లో తప్పిదాలకు తావివ్వొద్దు
పార్వతీపురం: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల విధులను పూర్తి పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో సమర్ధవంతంగా నిర్వహించాలని, తప్పిదాలకు తావివ్వొద్దని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ పీఓలు, ఏపీఓలకు సూచించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో డీఆర్వో, డుమా పీడీలతో కలిసి ఈ నెల 27న జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియపై పీఓలు, ఏపీఓలకు మంగళవారం తొలివిడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియపై పీఓలు, ఏపీఓలకు పూర్తి అవగాహన అవసరమన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలను తూచా తప్పక పాటించాలన్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. ఆ సమయంలో పోలింగ్ కేంద్రం పరిధిలో క్యూలో ఉన్నవారికి వరుస క్రమంలో టోకెన్ నంబర్లు అందించి ఓటు హక్కును కల్పించాలన్నారు. పోలింగ్ ముందు రోజున ఉదయం 7 గంటలకు పార్వతీపురం కలెక్టరేట్‌లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కు పీఓలు తమ బృందంతో చేరుకోవాలన్నారు. పంపిణీ కేంద్రాల వద్ద సరఫరా చేసే సామగ్రిని పరిశీలించి తీసుకోవాలన్నారు. తరువాత తమ బృందంతో కలిసి యంత్రాంగం సమకూర్చిన వాహనంతో నిర్దేశించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలన్నారు.
చిన్నపాటి తప్పిదాలకు కూడా తావులేకుండా పారదర్శకంగా పోలింగ్ ప్రక్రియ జరిగేలా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతి లేదన్నారు. పోలింగ్ ముగిసిన తరువాత బ్యాలెట్ బాక్సులను నిర్దేశించిన రిసెప్షన్ సెంటర్‌లో అప్పగించాల్సిన బాధ్యత పీఓలదేనన్నారు. శిక్షణ కార్యక్రమంలో డీఆర్‌ఓ కె.హేమలత, డుమా పీడీ కె.రామచంద్రరావు, పీఓలు, ఏపీఓలు, ఎన్నికల సూపర్‌వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment