మిగులు ధాన్యం కొనుగోలుకు చర్యలు
పాలకొండ: రైతుల వద్ద మిగిలి ఉన్న ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకున్నట్టు సబ్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్ రెడ్డి తెలిపారు. రైతుల వినతిమేరకు ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్తామన్నారు. ఈ మేరకు జిల్లా పౌర సరపరాల శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారన్నారు. రైతులు తమ వద్ద ఉన్న ధాన్యం సంబంధిత ఆర్‌ఎస్‌కేల ద్వారా విక్రయించుకోవాలని సూచించారు.
భామినిలో భారీ వర్షం
భామిని: మండలంలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షంతో వరి నూర్పిడి చేస్తున్న రైతులు ఇబ్బందులు పడగా, మెట్ట పంటలు, వేసవి దుక్కులకు వర్షం ఉపకరిస్తుందని రైతులు చెబుతున్నారు. వాతావరణం చల్లబడడంతో గత వారం రోజులుగా ఎండవేడిమితో ఇబ్బంది పడిన ప్రజలు కాస్త ఉపశమనం పొందారు.
25న జాబ్‌మేళా
సీతంపేట: స్థానిక వైటీసీలో ఈనెల 25న జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు ఐటీడీఏ పీఓ యశ్వంత్‌కుమార్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు కంపెనీల్లో మెషిన్ ఆపరేటర్, అసెంబెల్ ట్రైనీస్ ఉద్యోగాలకు అర్హులైన 300 మందిని ఎంపిక చేస్తారన్నారు. పదోతరగతి, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన 18–32 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులుగా పేర్కొన్నారు. ఎంపికై న వారు నెల్లూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటందన్నారు. నెలకు ఉచిత భోజన, వసతి సదుపాయాలతో రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు జీతం ఉంటుందన్నారు. పీఎఫ్, ఈఎస్‌ఐ సదుపాయం ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు సెల్: 88866 60974, 88866 60979 నంబర్లను సంప్రదించాలని కోరారు.
అంగన్‌వాడీల్లో మౌలిక వసతులు కల్పించాలి
పార్వతీపురంటౌన్: జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో వారంరోజుల్లోగా మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అంగన్‌వాడీల పనితీరుపై శనివారం సమీక్షించారు. విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు వంటి సదుపాయాలు కల్పించాలన్నారు. ఫోర్టిఫైడ్ రైస్ ప్రయోజనాలను ప్రజలకు వివరించాలన్నారు. బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించాలని సూచించారు. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందజేసి రక్తహీనత నివారణకు కృషిచేయాలన్నారు. నిర్దేశించిన లక్ష్యాల్లో వెనుకంజలో ఉన్న ఐదుగురు సీడీపీఓలకు చార్జ్ మెమోలు జారీచేశారు. సమావేశంలో జిల్లా మహిళా, శిశుసంక్షేమ శాఖ అధికారి టి.కనకదుర్గ, జిల్లా గ్రామీణ నీటి సరఫరా ఇంజినీరింగ్ అధికారి ఒ.ప్రభాకరరావు, సీడీపీఒలు, సూపర్ వైజర్లు, పాల్గొన్నారు.
చిరుధాన్యాలతో ఆరోగ్యం
విజయనగరం ఫోర్ట్: చిరుధాన్యాలతో ఆరోగ్యం సిద్ధిస్తుందని, ఇటీవల కాలంలో చిరుధాన్యాల వినియోగం పెరిగిందని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి సంచాలకులు డాక్టర్ సి.తారాసత్యవతి అన్నారు. గాజులరేగ వ్యవసాయ పరిశోధన స్థానంలో శనివారం నిర్వహించిన చిరుధాన్యాల కిసాన్ మేళాను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిరుధాన్యాల్లో పోషక విలువలు అధికమన్నారు. రైతులు గ్రూపులుగా ఏర్పడితే చిరుధాన్యాలను ఉపఉత్పత్తులుగా తయారు చేసుకునే యంత్ర పరికరాలను అందిస్తామన్నారు. కిసాన్ మేళాలో చోడి, కొర్ర, సామ తదితర చిరుధాన్యలతో తయారు చేసిన బిస్కెట్స్, మిక్సర్, మురుకులు, నువ్వు ఉండలు వంటి ఆహార పదార్థాల స్టాల్స్‌ను ఏర్పాటుచేశారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉపకరణాలు అందజేశారు. కార్యక్రమంలో గిరిజన ఉప ప్రణాళిక ప్రాజెక్టు పరిశీలకుడు కె. శ్రీనివాసబాబు, ప్రాజెక్టు ఇన్‌చార్జి సంగప్ప, అనకాపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ ఆదిలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment