సెకీ విద్యుత్ ఒప్పందం సక్రమమే
పార్వతీపురంటౌన్: సెకీ విద్యుత్ ఒప్పందం సక్రమమేనని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి తేల్చి చెప్పిందని, ఇన్నాళ్లూ తాము చెప్పినవన్నీ అబద్ధాలు, కల్పిత కథనాలేనని కూటమి ప్రభుత్వం ఒప్పుకున్నట్‌లైందని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. తన స్వగృహంలో శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సెకీతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందంలో అదానీ రూ.1,750 కోట్లు లంచం ఇచ్చారని, అంతర్జాతీయ స్థాయికి అవినీతిని చేర్చారని, పేరుకే సెకీ.. ఒప్పందం అదానీతోనేనని, ఐఎస్‌టీఎస్ చార్జీలు కట్టాల్సిందే అంటూ ఎల్లోమీడియా చేసిన దుష్ప్రచారం బట్టబయలైందన్నారు.
సంపద సృష్టించినదెవరు?
సెకీ నుంచి కారుచౌకగా విద్యుత్ కొనుగోలు వల్ల అప్పటి సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏడాదికి రూ.4,400 కోట్లు చొప్పున ప్రజాధనాన్ని ఆదాచేసిందన్నారు. అదే చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య విద్యుత్ యూనిట్ సగటున రూ.5.90 చొప్పున కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) చేసుకున్నారన్నారు. సెకీ నుంచి కొనుగోలు చేసిన దానికంటే యూనిట్ రూ.3.41 అధికంగా కొనుగోలుచేసి ప్రజాధనాన్ని దుబారా చేశారన్నారు. 25 ఏళ్లకు రూ.1.10 లక్షల కోట్లను ఆదాచేసి సంపద సృష్టించిన వై.ఎస్.జగన్ గొప్పా..? లేక రూ.87,500 కోట్లు ఖజానాపై భారం వేసి సంపదను ఆవిరి చేసిన చంద్రబాబు గొప్పా? అని ప్రశ్నించారు. 2019–2023 మధ్య జగన్ ప్రభుత్వం 2 లక్షలపైగా వ్యవసాయ డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేసిందన్నారు. చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో 3.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేస్తే.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సుమారు 5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చి సాగుకు చేదోడువాదోడుగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో 9 గంటలు వ్యవసాయానికి పగటిపూట విద్యుత్ సరఫరా చేసేలా 6,663 ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు రూ.1,700 కోట్లు వెచ్చించారన్నారు.
తేల్చిచెప్పిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి
టీడీపీ, ఎల్లోమీడియా దుష్ప్రచారం బట్టబయలు
Comments
Please login to add a commentAdd a comment