పాడి రైతు కుదేలు...!
వీరఘట్టం: మార్కెట్‌లో ప్రస్తుతం ఒక లీటరు వాటర్ బాటిల్ ఖరీదు రూ.20 ఉంది. అదే బ్రాండెడ్ వాటర్ బాటిల్ ధర లీటరు రూ.50 లు. పాడి రైతు విక్రయించే పాల ధర మాత్రం కేవలం రూ.34లకు మాత్రమే డెయిరీలు కొనుగోలు చేస్తున్నాయి. ఇదేంటని డెయిరీ యాజమాన్యాన్ని రైతులు అడిగితే పాలలో వెన్న శాతం తగ్గుతుండడంతో పాలకు డిమాండ్ తగ్గిందని అందుకే గిట్టుబాటు ధర ఇవ్వలేమని చెప్పి పాడి రైతులను డెయిరీలు నిలువునా ముంచేస్తున్నాయి. దీంతో చేసిది ఏమీ లేక డెయిరీలు నిర్ణయించిన ధరకే పాలను విక్రయిస్తూ పాడి రైతులు లబోదిబోమంటున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక గత ఎనిమిది నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా పాడి రైతు పరిస్థితి ఇలానే ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెయిరీలు సిండికేట్‌గా మారాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాడి రైతులకు అండగా నిలిచి పాల ధరలను లీటరుకు రూ.6లు పెంచారు. దీంతో గత ఐదేళ్లుగా పాడి రైతులు లీటరు పాలను రూ.46ల చొప్పున డెయిరీలకు విక్రయించి అధిక లాభాలు పొందారు. ప్రభుత్వం మారడంతో పాడి రైతులకు కష్టాలు మొదలయ్యాయి.
ఇదీ పరిస్థితి
పార్వతీపురం మన్యం జిల్లాలో 2.70 లక్షల పశు సంపద ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో ఆవులు, గేదెలు 1.62 లక్షలు ఉండగా వీటిలో 60 శాతం మాత్రమే అనగా 97 వేలు మాత్రమే పాలిచ్చే ఆవులు, గేదెలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న మేలు జాతి పశువులు కావడంతో రోజుకు సరాసరిన 7.76 లక్షల లీటర్లు పాల ఉత్పత్తి వస్తోంది. ఇందులో ఇంటి వాడుకలకు, ఇతర అవసరాలకు పోను ప్రతీ రోజు జిల్లాలో ఉన్న వివిధ డెయిరీలకు 6 లక్షల లీటర్ల పాలను పాడి రైతులు అందజేస్తున్నారు. గత ఎనిమిది నెలల క్రితం వరకు ఈ లెక్కల ప్రకారం రోజుకు రూ.6 లక్షల లీటర్లు పాలను డెయిరీలకు ఇచ్చేవారు. ఇప్పుడు డెయిరీలు డిమాండ్ లేదని చెప్పి పాల ధరలలను రూ.8 నుంచి రూ.10ల వరకు తగ్గించేశాయి. పాల కొనుగోలును కూడా తగ్గించేశాయి. జిల్లాలో రోజుకు 3 లక్షల లీటర్లు పాలను మాత్రమే వివిధ డెయిరీలు కొనుగోలు చేస్తున్నాయి. పాల ఉత్పత్తిలో సగం పాలను మాత్రమే డెయిరీలు కొను గోలు చేయడంతో మిగిలిన పాలను ఏం చేయాలో తెలియక రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఏం జరుగుతోంది..
పాడి రైతుల వద్ద పాలను రూ.34లకు కొనుగోలు చేస్తున్న డెయిరీలు మార్కెట్‌లో మాత్రం వారి బ్రాండ్‌లతో లీటరు పాలను రూ.60లకు విక్రయిస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో డెయిరీలు పోటీ పడి ప్రత్యేక రాయితీలు ఇచ్చి పాడి రైతును ప్రోత్సహించేవారు. పాల ఉత్పత్తిని శతశాతం కొనుగోలు చేసేవారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్క రాష్ట్రాలకు వెళ్తున్న పాల ఎగుమతులను డెయిరీ కంపెనీలు నిలిపివేశాయి. డెయిరీలన్నీ సిండికేట్‌గా మారి రాష్ట్రంలో పాలకు డిమాండ్ తగ్గిందనే ప్రచారం చేపట్టారు. ఇలా పాలకు డిమాండ్ లేదని కొద్ది రోజులు చెప్పి తర్వాత తక్కువ ధరకే పాలను కొనుగోలు చేసేందుకు డెయిరీలు వేస్తున్న ఎత్తుగడ ఇదని పాడి రైతులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం పాడి రైతును నట్టేట ముంచుతోందని పాడి రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం పాడి రైతులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.
కూటమి పాలనలో సిండికేట్ అయిన డెయిరీలు
పాల ధరలను లీటరుకు రూ.8 నుంచి రూ.10లు తగ్గించేసిన డెయిరీలు
ఆవు పాలు మాత్రమే కొనుగోలు
గేదె పాలు వద్దే..వద్దు..
బయట వాళ్లకు విక్రయిస్తున్నా..
నా వద్ద మూడు ఆవులు ఉన్నాయి. రెండు పూటలా 15 లీటర్ల పాలు ఇస్తున్నాయి. పాలలో వెన్న శాతం తక్కువగా వస్తోందని చెప్పి డెయిరీ వాళ్లు పాల ధర తగ్గించేశారు. మీటరులో వచ్చే రీడింగ్‌ను బట్టి లీటరుకు రూ.32ల నుంచి రూ.34 వరకు ఇస్తున్నారు. దీంతో వారికి రోజుకు 5 లీటర్ల పాలనే ఇస్తున్నాను. మిగిలిన 10 లీటర్ల పాలను బయట వాళ్లకు లీటరు రూ.50 చొప్పున విక్రయిస్తున్నాను.
– వావిలపల్లి హరిబాబు, పాడి రైతు, ధశుమంతపురం, వీరఘట్టం మండలం
నెలకు రూ.3 వేలు వస్తోంది
ఒకప్పుడు లీటరు పాలు రూ.44 నుంచి రూ.46లకు డెయిరీలో కొనేవాళ్లు. ఇప్పుడు రూ.33లు మాత్రమే లీటరుకు ఇస్తున్నారు. రోజుకు నాలుగు లీటర్లు పాలకు గతంలో నెలకు రూ.5 వేలుకు పైగా డబ్బులు వచ్చేవి. ఇప్పుడు నెలకు మూడు వేలే వస్తోంది. దాణా, ఇతర ఖర్చులు పోను ఈ డబ్బులు కిట్టడం లేదు.
–గవర అప్పలస్వామి, పాడి రైతు,
వీరఘట్టం మండలం
గేదె పాలు కొనరంట
డెయిరీలో ఆవు పాలే కొంటారంట. గేదె పాలు అక్కర్లేదట. డెయిరీ ఉందని ఆవులు, గేదెలు పెంచుతూ పాల వ్యాపారం చేసుకుంటున్నాం. ఇప్పుడు సడెన్‌గా గేదె పాలు మాకొద్దంటే ఎవరికి అమ్మాలో మీరే చెప్పండి. పాల ధరలను తగ్గించేసి పాడి రైతు శ్రమను డెయిరీలు దోచుకుంటున్నాయి. – పారిశర్ల సంగమేషు,
పాడి రైతు, వీరఘట్టం మండలం
గతంలో లీటరు పాలకు
రూ.46 వచ్చేది
జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డెయిరీలో పాలను లీటరు రూ.46కు కొనేవారు. ఇప్పుడు ఎనిమిది నెలలుగా పాల రేటును డెయిరీలు తగ్గించేస్తున్నాయి. పుశువుల దాణా తక్కువ రేటుకు ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం పాల రేటు తగ్గుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు.
– వారాడ వెంకటరమణ, పాడి రైతు, యు.వెంకమ్మపేట, వీరఘట్టం మండలం
పాడి రైతు కుదేలు...!
పాడి రైతు కుదేలు...!
పాడి రైతు కుదేలు...!
పాడి రైతు కుదేలు...!
పాడి రైతు కుదేలు...!
Comments
Please login to add a commentAdd a comment