ఎమ్మెల్సీ ఎన్నికలకు సమాయత్తం కావాలి
పార్వతీపురం టౌన్: జిల్లాలో ఈ నెల 27న జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలకు సమాయత్తం కావాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై పీఓ, ఏపీఓ, ఓపీఓ, ఎంఓలు, సంబంధిత అధికారులతో కలెక్టర్ ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఫిబ్రవరి 27న ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఎమ్మెల్సీ పోలింగ్ జరగనుందన్నారు. ఈ ఎన్నికలకు 2,333 మంది ఉపాధ్యాయ ఓటర్లు నమోదు కాగా, అందులో పురుషులు 1,574 మంది, మహిళలు 759 మంది ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. అత్యధికంగా పార్వతీపురంలో 636, పాలకొండలో 301, సాలూరులో 250 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా పాచిపెంటలో 34 మంది ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 15 మండలాల్లో జరిగే ఈ ఎన్నికల కోసం ఇప్పటికే (20 శాతం రిజర్వుతో కలిపి ) 18 మంది ప్రీసైడింగ్ అధికారులు, 18 మంది అసిస్టెంట్ ప్రీసైడింగ్ అధికారులు, 36 మంది ఇతర పోలింగ్ అధికారులు, 18 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించినట్లు చెప్పారు. ఎన్నికల నిర్వహణపై ఈ నెల 18వ తేదీన పీఓలు, ఏపీఓలకు తొలి విడత శిక్షణ ఇవ్వడం జరిగిందని, రెండో విడత శిక్షణ సోమవారం ఉంటుందని కలెక్టర్ వివరించారు. ఎన్నికల ప్రక్రియలో పీఓలు కీలక పాత్ర వహించాల్సి ఉంటుందన్నారు.
పూర్తి బాధ్యత వహించాలి
ఎన్నికల సామగ్రి స్వీకరించినప్పటి నుంచి బ్యాలెట్ బాక్సులు అప్పగించేంత వరకు పూర్తి బాధ్యత వహించాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ తేల్చి చెప్పారు. పోలింగ్ ముందురోజున పార్వతీపురం కలెక్టరేట్‌లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద పోలింగ్ మెటీరియల్ పంపిణీ ఉంటుందని, చెక్ లిస్ట్ మేరకు వాటిని పరిశీలించుకోవాల్సిన బాధ్యత పీఓలపై ఉందన్నారు. పోలింగ్ నిర్వహణ కోసం జిల్లాను ఆరు జోన్లగా విభజించడం జరిగిందని, అవసరం మేరకు బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. పీఓలకు కేటాయించిన పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్‌తో ఇతర ఏర్పాట్లను ముందుగా పరిశీలించుకోవాలని, ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. పోలింగ్ కేంద్రంలో తలెత్తే సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత పీఓలదేనని కలెక్టర్ ఉద్ఘాటించారు. సమావేశంలో ప్రీసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రీసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ అధికారులు, సూక్ష్మ పరిశీలకులు, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment