పార్వతీపురం రూరల్: పల్లెలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే అందరి లక్ష్యం కావాలని జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు అన్నారు. మండలంలోని వెంకంపేటలో ఇంటింటి చెత్త సేకరణ కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 451 గ్రామ పంచాయతీల్లో చెత్త సేకరణ కార్యక్రమం సాగుతుందన్నారు. శని, ఆదివారాల్లో అన్ని గ్రామ పంచాయతీల్లో చెత్త సేకరణ చేసి సందప తయారు చేసే కేంద్రాలకు తరలించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ అంబాసిడర్ల సేవలను, గ్రామ పంచాయతీ సిబ్బంది సేవలను వినియోగిస్తున్నామని తెలిపారు. జిల్లాలో రెండు రోజుల్లో 8,500 కిలోల తడి చెత్తను, 5,500 కిలోల పొడి చెత్తను సేకరించినట్టు పేర్కొన్నారు. జిల్లాను పరిశుభ్రంగా ఉంచేందుకు ఇంటింట చెత్త సేకరణ కార్యక్రమం ఎంతో దోహదం చేస్తుందన్నారు.
గిరిశిఖర గర్భిణుల
వసతిగృహ సందర్శన
సాలూరు: పట్టణంలోని వైటీసీలో గిరిశిఖర గర్భిణుల వసతిగృహాన్ని ఆరోగ్య శాఖ జిల్లా ప్రోగ్రాం అధికారులు డా.టి.జగన్‌మోహన్‌రావు, డా.పి.ఎల్.రఘు ఆదివారం సందర్శించారు. గర్భిణులకు అందుతున్న సదుపాయాల తదితర అంశాలపై ఆరా తీశారు. రికార్డులను తనిఖీ చేశారు. వారికి అందిస్తున్న వైద్య సేవలు, పోషకాహారం తదితర విషయాలను తెలుసుకుని, ఏమైనా సమస్యలున్నాయా.. అని అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది గర్భిణులకు అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం నిర్మాణమవుతున్న ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. వారి వెంట వైటీసీ మేనేజర్ విద్యాసాగర్, సిబ్బంది తదితరులు ఉన్నారు.
విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి
● త్వరలో సీఎంను కలుస్తాం
● విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ
విశాఖ–లీగల్: విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామని విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది బెవర సత్యనారాయణ స్పష్టం చేశారు. ఆదివారం నగరంలోని విశాఖ న్యాయవాదుల సంఘం ఆవరణలో ఆరు జిల్లాల న్యాయవాదుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో న్యాయవాదులందరూ విశాఖకు హైకోర్టు బెంచ్, కేంద్ర పారిశ్రామిక ట్రిబ్యునల్ ఏర్పాటుకు ముందడుగు వేయాలని నిర్ణయించారు. శ్రీకాకుళం, పార్వతీపురం వంటి సుదూర ప్రాంతాల నుంచి విజయవాడ వెళ్లాలంటే చాలా భారంగా ఉందని న్యాయవాదులు తెలిపారు. ఈ సందర్భంగా విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు బెవరా సత్యనారాయణ మాట్లాడుతూ ఇప్పటికే విశాఖ అన్ని రకాలుగా మోసానికి గురైందని వెల్లడించారు. అంతర్జాతీయ ఖ్యాతిని గడిస్తున్న విశాఖకు హైకోర్టు బెంచ్ కేటాయించడం అన్ని విధాల శ్రేయోదాయకమన్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు పి. నరసింహారావు మాట్లాడుతూ విశాఖలో హైకోర్టు ఏర్పాటు సంబంధించి న్యాయశాఖకు అభ్యంతరాలు ఉండకపోవచ్చన్నారు. 1993లో హైకోర్టుమెంట్ సాధనకు న్యాయవాదులు చేసిన ఉద్యమాలను గుర్తు చేస్తూ భవిష్యత్తులో ప్రజల భాగస్వామ్యంతో పోరాడతామన్నారు. సోమవారం నుంచి నల్లబ్యాడ్జీలు ధరించి న్యాయస్థానానికి హాజరవుతామని వివరించారు. సీనియర్ న్యాయవాది లక్ష్మీ రాంబాబు, బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఎస్.కృష్ణమోహన్, ఏవీ పార్వతీశం, కృష్ణ శేఖర్, పూర్వ అధ్యక్షుడు చింతపల్లి రాంబాబు, పాలకొండ, బొబ్బిలి, రాజాం, గజపతినగరం, అనకాపల్లి, చోడవరం, తుని, యలమంచిలి, విజయనగరం, ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో న్యాయవాదులు ఈ సదస్సులో పాల్గొన్నారు. న్యాయవాద సంఘం కార్యదర్శి డి.నరేష్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
Comments
Please login to add a commentAdd a comment