సీతంపేట: మండలంలోని రేగులగూడ కాలనీలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక పూరిల్లు మూడు పశువుల పాకలు దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో తెలియరావడం లేదని గిరిజనులు తెలిపారు. గ్రామంలో అందరూ కొండపోడు పనులకు వెళ్లిపోయారు. ఇంటిలో ఎవరూ లేని సమయంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో సవరలక్ష్మణ్‌కు చెందిన రూ.లక్షా 50 వేల నగదు. రెండు తులాల బంగారం, సామగ్రి కాలిపోయాయి. ఇంట్లో బంధువుల వివాహం ఇటీవల జరగడంతో సారె సామగ్రి, బట్టలు మొత్తం కాలిపోవడంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. గ్యాస్, టీవీ, మంచం, 14 బస్తాల ధాన్యం అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో ఆ కుటుంబం కట్టుబట్టలతో మిగిలింది.సవర రామారావు, సవర లక్కాయి, సవర బెన్నయ్యలకు చెందిన మూడు పశువుల శాలలు, ఒక సైకిల్, ఐటీడీఏ గతంలో ఇచ్చిన పవర్‌వీడర్ దగ్ధమయ్యాయి. స్థానికులతో పాటు కొత్తూరు అగ్నిమాపకశకటం వచ్చి మంటలను అదుపుచేసింది. విషయం తెలుసుకున్న ఆర్‌ఐ విజయ్‌గణేష్‌తో పాటు సిబ్బంది గ్రామాన్ని సందర్శించి నష్టం దాదాపు రూ.3లక్షలు ఉంటుందని అంచనా వేశారు.
ఒక పూరిల్లు, మూడు పాకలు దగ్ధం