బొబ్బిలి: ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేయలేని వయసు మాది.. ఎన్నికల ముందు, తర్వాత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందనుకున్నాం.. మా ఆశలన్నీ అడియాసలయ్యాయి.. మోసపోయాం అంటూ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పీఎస్‌ఎస్‌ఎన్‌పీ శాస్త్రి ఆవేదన వ్యక్తం చేశారు. బొబ్బిలి పట్టణంలో సోమవారం నిర్వహించిన సంఘ రాష్ట్ర స్థాయి సమావేశంలో ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అనంతరం తమ డిమాండ్లను వివరిస్తూ బొబ్బిలి ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ జేవీవీఎస్ రామమోహనరావుకు వినతిపత్రాన్ని అందజేశారు. సంఘ కార్యవర్గ సభ్యులతో కలిసి అక్కడ విలేకరులతో మాట్లాడారు. గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చిన మాట ప్రకారం ఐఆర్‌ను ఏడు శాతం నుంచి 12 శాతానికి పెంచుతూ జీఓ విడుదల చేశారన్నారు. బుడమేరు వరదల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును స్వయంగా కలిసి ఈహెచ్‌ఎస్, క్వాంటమ్ పెన్షన్, పెండింగ్ ఐఆర్, డీఏలతో పాటు పీఆర్‌సీ కమిషన్ ఏర్పాటు అంశాలను వివరించామని, అన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. అనంతరం పలుసార్లు మంత్రివర్గ సమావేశాలు నిర్వహించినా ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రస్తావనే లేదన్నారు. కొంత మంది పెద్దలను కలిసి మేం మీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న వారమని, మాకు న్యాయం చేయాలని అడిగితే మీరు మమ్మల్ని ఎన్నుకోవడమేంటి? ప్రజలెన్నుకున్నారన్నారని అంటున్నారని, మేమంతా ప్రజల్లో భాగం కాదా? మేము ఓట్లేయలేదా అని ఆయన ప్రశ్నించారు. ఈ సమయంలో మరో రాష్ట్ర నాయకుడు రౌతు రామమూర్తినాయుడు తదితరులు షేమ్‌షేమ్ అంటూ నినదించారు. ప్రస్తుతం ఈహెచ్‌ఎస్‌పై వైద్యసేవలు అందజేసేందుకు ఆస్పత్రులు నిరాకరించే స్థాయికి ప్రభుత్వం మమ్మలను దిగజార్చిందంటూ జీఓ కాపీలను ఆయన సభా ముఖంగా ప్రదర్శించారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు రౌతు రామమూర్తినాయుడు, రాష్ట్ర కార్యదర్శి ఎల్.జగన్నాథం, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి కృష్టమూర్తినాయుడు, కార్యదర్శి బొత్స సత్యనారాయణ, పలువురు సంఘ నాయకులు, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయాం
రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శాస్త్రి