పార్వతీపురం: ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో 2025–26 విద్యాసంవత్సరంలో ఐదవతరగతి ప్రవేశానికి, 6,7,8,9 తరగతులలో బ్యాక్ లాగ్ ఖాళీల ప్రవేశానికి ఏప్రిల్ 20న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షను ఏప్రిల్ 6న నిర్వహించనున్నట్లు తొలుత ప్రకటించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల సొసైటీ గురుకులం, తాడేపల్లి, గుంటూరు వారి ఆదేశాల మేరకు ఏప్రిల్ 6న జరగాల్సిన పరీక్షను ఏప్రిల్ 20 తేదీకి మార్పు చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే విద్యార్థులు ప్రవేశంకోసం ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 9వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరాఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఏపీటీడబ్ల్యూఆర్‌ఎస్ పి.కోనవలస, ఏపీటీడబ్ల్యూఆర్‌ఎస్ (బాలికలు) కురుపాం, ఏపీటీడబ్ల్యూఆర్‌ఎస్ (బాలురు) భద్రగిరి, ఏపీటీడబ్ల్యూ ఆర్‌ఎస్ (బాలురు) కొమరాడ కేంద్రాల్లో నిర్వహించనున్న పరీక్షలకు హాజరుకావాలని పిలుపునిచ్చారు.
సీతంపేటలో మలేరియా
నివారణ క్యాంపు కార్యాలయం
సీతంపేట: సీతంపేటలో మలేరియా నివారణ క్యాంపు కార్యాలయం యథావిధిగా ఏర్పాటైంది. 2021లో ఇక్కడ ఉన్న జిల్లా మలేరియా నివారణ కార్యాలయాన్ని శ్రీకాకుళానికి తరలించారు. కేవలం సబ్‌యూనిట్ ఆఫీస్ మాత్రమే ఇక్కడ ఉండేది. సీతంపేట ఐటీడీఏ పరిధిలోని పలు మండలాల్లో మలేరియా పాజిటివ్ కేసులు నమోదు కావడం, పర్యవేక్షణ తగ్గడంతో స్థానిక పాత స్టేట్ బ్యాంకు వద్ద కార్యాలయం ఏర్పాటుచేశారు. రెండు రోజుల కిందట సిబ్బంది విధుల్లో చేరారు. శ్రీకాకుళం జిల్లా మలేరియా నివారణాధికారి పి.వి.సత్యనారాయణ పర్యవేక్షించనున్నారు. మలేరియా నివారణ కన్సల్టెంట్, ఏఎంఓ, హెల్త్ అసిస్టెంట్లు, సబ్‌యూనిట్ ఆఫీసర్, నాల్గో తరగతి సిబ్బంది సేవలందించనున్నారు.
భూముల రీ సర్వేకు రైతులు సహకరించాలి
రేగిడి: భూముల రీ సర్వేకు రైతులు సహకరించాలని జిల్లా ల్యాండ్ సర్వే అఽధికారి రమణమూర్తి రైతులకు సూచించారు. మండలంలోని అంబఖండి గ్రామంలో గురువారం రీ సర్వేకు సంబంధించి అధికారులు, రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు పొలాల్లోకి వెళ్లి సర్వే చేసిన సమయంలో ఆ భూములకు సంబంధించిన ప్రతి రైతు తప్పనిసరిగా ఉండాలన్నారు. చట్టపరంగా రైతులకు సంబంధించిన భూములకు పూర్తిస్థాయిలో హక్కులు కల్పిస్తామని తెలిపారు. కొన్ని భూములకు ఆధారాలు లేవని, అటువంటి భూములను అధికారులు హక్కులో ఉన్న రైతులకు రికార్డులో పొందుపరిచేలా చూడాలని సర్పంచ్ గోవిందనాయుడు అధికారులను కోరారు. సర్వే చేసిన అనంతరం ప్రతి రైతుకు నోటీస్ ఇస్తామని, అటువంటి వాటిలో ఎటువంటి సవరణలు ఉన్నా సంబంధిత తహసీల్దార్‌కు తెలియజేస్తే వాటిని పునఃసర్వే చేస్తామని రమణమూర్తి స్పష్టంచేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ సత్యవాణి, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే శ్రీనివాసరావు, తహసీల్దార్ ఎం.చిన్నారావు, రైతులు పాల్గొన్నారు.
ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష