
వారి క్రమశిక్షణ స్ఫూర్తిదాయకం
విజయనగరం క్రైమ్: సుదీర్ఘ కాలం పోలీసుశాఖలో బాధ్యతాయుతంగా ఎంతో క్రమ శిక్షణతో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన పోలీస్‌కంట్రోల్ రూమ్ ఎస్సై ఎన్ని సత్యానందరావు, గుర్ల పీఎస్ హెచ్‌సీ ఎ.భాస్కరరావులకు ఎస్పీ వకుల్ జిందల్ జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందల్, మాట్లాడుతూ పోలీసుశాఖలో సుదీర్ఘ కాలం మంచి సేవలందించి నేడు ఉద్యోగ విరమణ చేస్తున్న ఎస్సై ఎన్ని సత్యానందరావు, హెడ్ కానిస్టేబుల్ అదపాక భాస్కరరావులకు శుభాకాంక్షలు తెలిపారు. పోలీసు విధులను నిర్వహించడంలో క్రమశిక్షణ, అంకిత భావంతో పనిచేసి, ఇతర పోలీసు ఉద్యోగులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని ప్రశంసించారు. ఉద్యోగ విరమణ చేస్తున్న పోలీసు అధికారులకు ఏ సమస్య వచ్చినా తాను అందుబాటులో ఉంటానని, వారికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తానని ఎస్పీ వకుల్ జిందల్ భరోసా కల్పించారు. అనంతరం, ఉద్యోగ విరమణ చేసిన ఎస్సై ఎన్ని సత్యానందరావు దంపతులను, హెడ్ కానిస్టేబుల్ భాస్కరరావు దంపతులను పోలీసుశాఖ తరఫున ఎస్పీ వకుల్ జిందల్ శాలువాలు, పూలమాలలు, గిఫ్ట్, సన్మాన పత్రాలతో సత్కరించి, ఘనంగా వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) పి.సౌమ్యలత, ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, ఆర్వీఆర్కే చౌదరి, కంట్రోల్ రూమ్ సీఐ వైకుంఠరావు, ఎస్సైలు జగదీశ్వరరావు, శంకర్రావు, పోలీస్ అసోసియేషన్ అడహాక్ సభ్యుడు కె.శ్రీనివాసరావు, కో ఆపరేటివ్ కార్యదర్శి నీలకంఠం నాయుడు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, పోలీసు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఆత్మీయ వీడ్కోలు సభలో ఎస్పీ వకుల్ జిందల్