
రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధ పాలన
సాలూరు: రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగానికి విరుద్ధంగా కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ పాలన సాగిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోందని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సభ్యుడు పీడిక రాజన్నదొర వాపోయారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సాలూరు పట్టణంలోని బంగారమ్మపేట, పీఎన్ బొడ్డవలస ప్రాంతాల్లో అంబేడ్కర్ విగ్రహాలకు సోమవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్‌లు కట్‌చేసి చిన్నారులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగుబలహీన వర్గాలు, అగ్రవర్ణ పేదలందరికీ మేలు జరిగేలా, అనేక దేశాలకు ఆదర్శంగా నిలిచిన అంబేడ్కర్ రాజ్యాంగం కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో కనుమరుగవుతోందన్నారు. దళితులు, గిరిజనులపై దాడులు పెరిగాయన్నారు. మరిపల్లి, కేసలి, మోసూరు, కరాసవలస తదితర ప్రాంతాల్లో దళితులు, గిరిజనులపై జరిగిన కక్షపూరిత చర్యలను వివరించారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో తను ఏనాడూ రాజ్యాంగం, చట్టాలకు అతీతంగా నడుచుకోలేదని గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో సుమారు రూ.1300 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. 2014–19 మధ్యన అప్పటి టీడీపీ ప్రభుత్వం సాలూరు పట్టణంలో వంద పడకల ఆస్పత్రి, కందులపదం, మోసూరు, సాలూరు వంతెన పనులకు కొబ్బరికాయలు కొట్టి వదిలేస్తే తరువాత వైఎస్సార్‌సీపీ పాలనలో వాటి నిర్మాణాలు చేపట్టామని వివరించారు. కూటమి పాలనలో రాజకీయ కక్షతో సుమారు 25 మంది చిరుద్యోగులను విధుల నుంచి తొలగించారని, వారందరికీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.