
రైతన్నకు వడ్డీ భారం
వీరఘట్టం: రైతన్న తీసుకున్న రుణాలపై వడ్డీల భారం మోపేందుకు రంగం సిద్ధమవుతోంది. తీసుకున్న రుణానికి సకాలంలో ఏడు శాతం వడ్డీ చెల్లించి రెన్యువల్ చేయని రైతుల నుంచి 14 శాతం వడ్డీతో వసూలుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీనిపై రైతుల్లో ఆందోళన నెలకుంది. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేదికాదని, పంట పెట్టుబడికి ఠంచన్‌గా సాయం అందేదని, రుణాలపై వడ్డీభారం ఉండేది కాదని రైతులు వాపోతున్నారు.
ఇదీ పరిస్థితి...
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో ఒక రైతు రూ.1 లక్ష రుణం తీసుకుంటే 7శాతం వడ్డీతో ఏడాదికి రూ.7 వేలు వడ్డీ చెల్లించాలి. ఈ వడ్డీ చెల్లిస్తే మరసటి ఏడాది ఇదే రూ.1 లక్ష రుణా న్ని రెన్యువల్ చేస్తున్నారు. వడ్డీ కట్టకపోతే తీసుకున్న అప్పు రూ.1లక్ష, వడ్డీ రూ.7వేలుతో కలిపి మొత్తం రూ.1,07,000లను వచ్చేఏడాది అసలులో చేర్చుతూ అప్పుకింద చూపిస్తున్నారు. వడ్డీ కట్టని వారిని మొండిబకాయిల జాబితాలో చేర్చుతూ 14 శాతం వడ్డీతో రుణాల వసూళ్లకు రంగం సిద్ధం చేస్తున్నారు. వీరఘట్టం పీఏసీఎల్‌లో మొండి బకాయిలంటూ 1400 మంది రైతుల రుణాలు రెన్యువల్ చేయకుండా నోటీసులు ఇచ్చేందుకు కార్యాచరణ చేపడుతున్నారు.
ఆందోళనలో రైతులు
వీరఘట్టం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో 5,100 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. వీరిలో వ్యవసాయ రుణాలు పొందినవారు 3 వేల మంది ఉన్నారు. వీరంతా సుమారు రూ.30 కోట్ల వరకు రుణాలు తీసుకున్నారు. గతంలో వీరు వడ్డీ డబ్బులు చెల్లించినా, చెల్లించకపోయినా ఆ రుణాలను రెన్యువల్ చేస్తూ ప్రభుత్వం అండగా ఉండేది.
ప్రస్తుతం పాలక మండలి లేకపోవడంతో ప్రత్యేకాధికారుల పాలనలో పీఏసీఎస్‌లు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నెలాఖరుతో రైతు రుణాల రెన్యువల్ గడువు ముగిసింది. 1400 మంది రైతులు తీసుకున్న రూ. 12 కోట్లు రుణాలకు వడ్డీలు చెల్లించలేదని కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. వీరి నుంచి వసూలుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
నోటీసులు ఇస్తాం
పీఏసీఎస్‌లో రుణాలు తీసుకుని వడ్డీలు చెల్లించని రైతులకు నోటీసులు ఇస్తాం. వడ్డీ కట్టని వారి రుణాలు రెన్యువల్ చేస్తే వారికి కొత్త రుణాలు ఇచ్చినట్లు అవుతుంది. పాలకమండలి ఉన్నప్పుడు పరిస్థితులు వేరు. ప్రత్యేక పాలనలో పరిస్థితులు వేరు. అందుకే రుణాల వసూళ్లకు కార్యాచరణ ప్రణాళిక చేపడుతున్నాం.
– జి.మధుసూదనరావు,
స్పెషల్ ఆఫీసర్, పీఏసీఎస్, వీరఘట్టం
వీరఘట్టం వ్యవసాయ సహకార పరపతి
సంఘం కార్యాలయం
వీరఘట్టం పీఏసీఎస్‌లో రెన్యువల్‌కాని రుణం రూ.12కోట్లు
1400 మంది రైతులకు నోటీసులిచ్చేందుకు రంగం సిద్ధం