
ఉద్రిక్తతల నడుమ పామాయిల్ మొక్కల తొలగింపు
సంతకవిటి: మండలంలోని సిరిపురం గ్రామంలో కొండపై వెలసిన కొండకామేశ్వర స్వామి ఆలయం ఇటీవల దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చింది. ఈ ఆలయానికి సంబంధించి సర్వే నంబర్ 84లో 2.70 ఎకరాల భూమి ఉంది. ఈ పొలాన్ని కౌలుకు ఇచ్చేందుకు అధికారులు ముందుకు రావడంతో ఆలయ అర్చకుడు అడ్డుపడగా రెండు పర్యాయాలు వాయిదా పడింది. పొలంలోని పామాయిల్ మొక్కలు తొలగిస్తేనే కౌలుకు తీసుకునేందుకు ముందుకు వస్తామని సిరిపురం గ్రామ ప్రజలు పట్టుబట్టడంతో విజయనగరం దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శిరీష బుధవారం గ్రామానికి చేరుకుని జేసీబీ సహాయంతో మొక్కలను తొలగించారు. జేసీబీ పొలంలో దిగుతున్న సమయంలో, మొక్కలు తొలగిస్తున్న సమయంలో అర్చకుల కుటుంసభ్యులు పదేపదే జేసీబీకి అడ్డుతగిలారు. ఈ క్రమంలో అధికారులే రక్షణ కవచంలా నిలబడి వారిని నిలువరించారు. పోలీసులకు ముందస్తు సమాచారం అందించినా ఎవరూ కనీసం రాలేదని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శిరీష వాపోయారు. పని పూర్తి కావస్తున్న సమయంలో కేవలం ఇద్దరు పోలీసులు రావడం విశేషం. కార్యక్రమంలో ఈఓ బి.వి.మాధవరావు, రాజాం నవదుర్గ దేవాలయం ఈఓ పి.శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు.