
అవగాహన అవసరం
అగ్ని ప్రమాదాల నివారణకు
● 14 నుంచి ప్రారంభమైన జాతీయ వారోత్సవాలు
పార్వతీపురం రూరల్: ఇటీవల కాలంలో అగ్నిప్రమాదాలు తరచూ సంభవిస్తూనే ఉన్నాయి. అవగాహన లేక కొందరు, నిర్లక్ష్యం వహించి మరికొందరు ఈ ప్రమాదాలకు కారణం అవుతున్నారు. ఈ నేపథ్యంలో అగ్నిమాపక శాఖ అధికారులు ప్రతి ఏడాది అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఏడాది ‘అగ్ని సురక్ష దేశం కోసం– అందరం ఏకమవడం’ అనే నినాదంతో వారోత్సవాలను నిర్వహిస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా నాలుగు అగ్నిమాపక కేంద్రాలు
పార్వతీపురం జిల్లా కేంద్రం, గుమ్మలక్ష్మీపురం, సాలూరులో, పాలకొండలో అగ్నిమాపక కేంద్రాలున్నాయి.
ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు
వేసవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున పలు జాగ్రత్తలు పాటిస్తే మేలని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు.
● అగ్గిపెట్టె లైటర్లు మండే పదార్థాలకు చిన్న పిల్లలను దూరంగా ఉంచాలి
● నాణ్యతా ప్రమాణాలు ఉన్న ఎలక్ట్రికల్ పరికరాలను మాత్రమే వినియోగించాలి
● సెలవులపై ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఇంటి మెయిన్ ఆఫ్ చేయడం సురక్షితం
● వంట గదిలో గాలి వెలుతురు ఉండేలా చూసుకోవాలి
సమయస్ఫూర్తితో జాగ్రత్తలు పాటించాలి
షాపింగ్ మాల్‌కు, అలాగే నూతన ప్రదేశాలకు వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ గోడలపై అంటించిన ఫైర్ సేఫ్టీ మ్యాపులను చూడాలి. అగ్నిప్రమాదాల నివారణపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాం. ప్రమాదాలు జరిగిన చోటికి సమాచారం అందగానే క్షణాల్లోనే చేరుకునేలా సిబ్బంది అప్రమత్తంగా ఉంటున్నారు. అవసరమైన మేరకు సమీపంలో ఉన్న కేంద్రాల నుంచి కూడా అగ్నిమాపక వాహనాలను తెప్పిస్తున్నాం.
– కె. శ్రీనుబాబు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి, పార్వతీపురం మన్యం జిల్లా
● గ్యాస్ వాడకం పూర్తయిన తర్వాత సిలిండర్ వద్ద రెగ్యులర్ వాల్వ్‌ను నిలిపివేయాలి
● విద్యాసంస్థలు, ఆస్పత్రి, హోటల్‌లో అగ్నిప్రమాదాలు జరిగేటప్పుడు క్షేమంగా బయటపడేందుకు సరైన ప్రణాళికలను తయారుచేసి అవి అందరికీ అందుబాటులో ఉండే విధంగా చూడాలి
వారోత్సవాల్లో నిర్వహించే కార్యక్రమాలు
● 17న ఆస్పత్రిలోని సిబ్బందికి తరగతులు, మాక్‌డ్రిల్ ప్రదర్శన
● 18న పరిశ్రమలు, పెట్రోల్ బంకులు, గ్యాస్ గోదాముల్లో అవగాహన తరగతులు
● 19న కల్యాణ మంటపాలు, విద్యాసంస్థల్లో ఫైర్ సేఫ్టీ తనిఖీలు
● 20 న రాజకీయ పార్టీ ప్రతినిధులతో అగ్నిమాపక కార్యాలయంలో ప్రమాదాల నివారణపై శిక్షణ తరగతుల సమావేశం.

అవగాహన అవసరం