
● కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి సొంత క్యాంపస్ ● స
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి 2023 ఆగస్టు 25వ తేదీన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కలిసి నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేసినచోటనే శాశ్వత క్యాంపస్ సమకూరుతోంది. గిరిజనుల జీవితాల్లో కాంతులు నింపాలంటే ఈ విద్యాదీపం నిబంధనల ప్రకారం వారి చెంతనే ఉండాలన్న ఆయన ఆశయం నెరవేరుతోంది. ప్రస్తుతం విజయనగరం శివారు గాజులరేగ వద్ద ఏయూ స్టడీ సెంటర్ భవనాల్లో తాత్కాలికంగా కొనసాగుతున్న ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థను ఎస్టీ రిజర్వుడ్ సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మెంటాడ మండలానికి మార్చేందుకు మార్గం సుగమమవుతోంది. పచ్చని కొండల నడుమ 561.88 ఎకరాల సువిశాలమైన ప్రకృతి రమణీయతతో కూడిన చక్కని ప్రాంతంలో విద్యాసౌరభాలు విరబూయనున్నాయి. రూ.834 కోట్ల నిధులతో భవనాల నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. పరిపాలన భవనం (అడ్మిన్ బిల్డింగ్), తరగతి భవనాలు (అకడమిక్ బ్లాక్స్), విద్యార్థుల వసతి భవనాలను రానున్న విద్యాసంవత్సరానికి పూర్తి చేయడానికి అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.