
పేద పిల్లలకు కార్పొరేట్ విద్య
● గత ప్రభుత్వం సంస్కరణల ఫలితమే ● ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం కింద 25 శాతం ఉచితవిద్య ● 2022–23లో పథకాన్ని ప్రవేశపెట్టిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ● తాజాగా నోటిఫికేషన్ జారీచేసిన సమగ్ర శిక్ష అభియాన్
రామభద్రపురం:
పేదింటి పిల్లలు ప్రపంచంతో పోటీపడేలా, తరతరాల వారి తలరాతలను మార్చాలని గడిచిన ఐదేళ్ల పాటు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యారంగంలో సంస్కరణల విప్లవం తీసుకువచ్చారు. ఒక చదువుతోనే పేదరికాన్ని అధిగమించడం సాధ్యమని బలంగా విశ్వసించి ప్రాథమిక విద్యావ్యవస్థలో ఎన్నడూ లేని విధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. మనబడి నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దారు. పేద విద్యార్థులకు అమ్మఒడి, పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు, బైల్టులు, టై తదితర పథకాలు పకడ్బందీగా అమలు చేశారు. ఈ క్రమంలోనే అక్షరాన్ని కాసులు పెట్టి కొనుక్కునే స్థోమత లేని ఎంతోమంది పేద విద్యార్థుల చదువుకు అంతరాలు, అడ్డగోడలు ఉండకూడదని ఆలోచించి విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలనే నిబంధనను నాటి ప్రభుత్వం పక్కాగా అమలు చేసింది. దీనికి అనుగుణంగా ప్రైవేట్, అన్‌ఎయిడెడ్, పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి ఉచిత విద్యనందించేందుకు 2022–23 విద్య సంవత్సరంలోనే ఈ పఽథకానికి శ్రీకారం చుట్టారు. జిల్లావ్యాప్తంగా 302 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా విద్యాహక్కు చట్టం–2009 ద్వారా గత ఏడాది 283 పాఠశాలల్లో 1326 మంది పేదవిద్యార్థులు ప్రవేశం పొందారు. వారిలో అధికశాతం విద్యార్థులు ఆయా విద్యాసంస్ధల్లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం అదే ఉచిత విద్యావిధానాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగించేలా నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం
విద్యాహక్కు చట్టం–2009 అమలులో భాగంగా 2025–26 విద్యా సంవత్సరానికి ఐబీ, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, స్టేట్ సిలబస్ అమలవుతున్న పాఠశాలల్లో ఒకటో తరగతిలో ప్రవేశానికి ఈ నెల 28 నుంచి మే 15వ తేదీ వరకూ వివిధ వర్గాల నుంచి ఉచిత విద్యకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.అర్హులైన విద్యార్థులు ఆధార్ ద్వారా ప్రాథమిక వివరాలతో హెచ్‌టీటీపీ://సీఎస్‌ఈ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అదే సమయంలో వారి నివాసానికి సమీపంలో ఉండే పాఠశాలలను ఎంపిక చేసుకునే వీలుంది.
అర్హతలు..
ఐబీ, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ అమలవుతున్న పాఠశాలల్లో ఒకటో తరగతిలో ప్రవేశం కోసం 31.3.2025 నాటికి ఐదేళ్లు వయసు నిండి ఉండాలి.స్టేట్‌సిలబస్ పాఠశాలల్లో ప్రవేశానికి 1.6.2025 నాటికి ఐదేళ్లు నిండాలి. అన్ని ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25 శాతం ఉచిత సీట్లను ప్రభుత్వం కేటాయించగా అనాథలు, హెచ్‌ఐవీ ఎఫెక్టెడ్, డిజేబుల్డ్ వారికి 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు నాలుగు శాతం, బీసీలు, మైనార్టీలు, ఇతరులకు ఆరు శాతం సీట్లు మంజూరు చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.2 లక్షలు, పట్టణ ప్రాంతాల వారు రూ.1.44 లక్షల ఆదాయానికి మించి ఉండరాదు.
విద్యా హక్కు చట్టాన్ని పక్కాగా పాటించాలి
అందరికీ విద్య అందించేందుకు విద్యాహక్కు చట్టం మేరకు పేదలకు ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది.ఇది పేద విద్యార్థులకు వరం. నోటిఫికేషన్ ప్రకారం అర్హులు దరఖాస్తు చేసుకోవాలి.అలాగే విద్యా హక్కు చట్టాన్ని ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలలు పక్కాగా పాటించాలి. ఈ నెల 28వ తేదీలోపు ప్రతి పాఠశాల రిజిస్టర్ కావాల్సి ఉంది. ఈ నోటిఫికేషన్ వచ్చే విద్యా సంవత్సరం కోసం విడుదల చేశారు.
యు.మాణిక్యంనాయుడు, డీఈవో, విజయనగరం

పేద పిల్లలకు కార్పొరేట్ విద్య

పేద పిల్లలకు కార్పొరేట్ విద్య