
మలేరియా నివారణపై అవగాహన
పార్వతీపురంటౌన్: అవగాహనతోనే మలేరియాను నివారించవచ్చని, అందుకోసం ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.భాస్కరరావు అన్నారు. ప్రపంచ మలేరియా నివారణ దినం సందర్భంగా అవగాహన ర్యాలీని శుక్రవారం ఆరోగ్యశాఖ కార్యాలయం దగ్గర ఆయన జెండా ఊపి ప్రారంభించారు. మలేరియా నివారణ నినాదాలతో ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఎన్‌జీఓ హోం సమావేశ భవనంలో నిర్వహించిన అవగాహన సదస్సు డీఎంహెచ్‌ఓ మాట్లాడారు. మలేరియా వ్యాధి, నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగిఉండాలని తద్వారా నిర్మూలన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. జిల్లాలో మలేరియా ప్రభావిత గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయని, దోమల నివారణ చర్యల్లో భాగంగా 915 గ్రామాల్లో వచ్చే నెల ఒకటవ తేదీనుంచి ఐఆర్‌ఎస్ స్ప్రేయింగ్‌ను ఇంటింటికీ చేయించనున్నట్లు చెప్పారు. జూలై 1 నుంచి రెండవ విడత పిచికారీ చేయిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగాం అధికారి డాక్టర్ టి.జగన్ మోహనరావు, పీఎల్.రఘుకుమార్, ఏఎంఓడీ సూర్యనారాయణ, వైద్యాధికారి డా. రవించద్ర, క్వాలిటీ కన్సల్టెంట్స్ డా.రమణ, డా.మణికంఠ, ఎన్జీఓ అధ్యక్షులు జీవీఆర్‌ఎస్. కిషోర్, డెమో సన్యాసిరావు, సబ్‌యూనిట్ అధికారి ధనుంజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.