సన్నబియ్యం పంపిణీకి సన్నద్ధం
● ఉగాది పండుగ నుంచి అందజేసేందుకు నిర్ణయం ● రేషన్ దుకాణాలకు చేరుతున్న బియ్యం ● కార్యాచరణ రూపొందిస్తున్న జిల్లా పౌర సరఫరాల అధికారులు
సుల్తానాబాద్(పెద్దపల్లి): జిల్లాలోని తెల్లరేషన్‌కార్డుదారులకు ఉగాది పండుగ నుంచి సన్నబియ్యం పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ సర్వం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం అవసరమైన ముందస్తు కార్యాచరణ రూపొందిస్తోంది. జిల్లావ్యాప్తంగా ఒకేసారి సన్నబియ్యం పేదలకు అందించేలా ప్రణాళిక తయారు చేస్తోంది. ఈమేరకు జిల్లా సివిల్ స్లయీస్ అధికారి రాజేందర్ డీలర్లు, రైస్‌మిల్లర్లతో ఇటీవల సమావేశమయ్యారు. బియ్యం పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. గోదాంల నుంచి లారీల ద్వారా నేరుగా రేషన్ డీలర్లకు సన్నబియ్యం సరఫరా చేసేలా సూచనలు ఇచ్చారు.
ఉచితంగానే సన్నబియ్యం..
జిల్లాలోని పేద కుటుంబాలకు రేషన్‌కార్డు ద్వారా ఉచితంగానే సన్నబియ్యం పంపిణీ చేస్తారు. తద్వారా నిత్యావసరాలపై పేదలు చేసే ఆర్థిక భారం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఇప్పటికే కేవైసీ పూర్తిచేసిన తెల్లరేషన్‌కార్డుదారులు అందరికీ ఈ పథకం ద్వారా వచ్చే నెల నుంచి సన్నబియ్యం అందుతాయి.
ప్రతినెలా 3,852 మెట్రిక్ టన్నులు అవసరం..
జిల్లా వ్యాప్తంగా 413 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 2,19,382 తెల్లరేషన్‌కార్డుల ద్వారా ప్రతినెలా రేషన్‌బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం ప్రతీనెల సుమారు 3,852 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం అవసరమని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు అంచనా వేశారు. ఈమేరకు సుల్తానాబాద్, పెద్దపల్లి, మంథనిలోని స్టాక్ పాయింట్ల నుంచి బియ్యం సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
జిల్లా సమాచారం
రేషన్‌కార్డులు 2,19,382
అన్నపూర్ణ 175
అంత్యోదయ 12,297
రేషన్‌దుకాణాలు 413
నెలకు అవసరమయ్యే సన్నబియ్యం(మె. ట) 3,852
శుభపరిణామం
మాలాంటి పేదలకు ఉగాది నుంచి సన్నబియ్యం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలకు దీనిద్వారా పౌష్టికారం అందుతుంది.
– పత్తి మల్లారెడ్డి, లబ్ధిదారు, కాల్వశ్రీరాంపూర్
డీలర్లకు సరఫరా చేస్తున్నాం
తెల్లరేషన్‌కార్డుదారులకు ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గోదాముల నుంచి రేషన్ దుకాణాలకు ఇప్పటికే సన్నబియ్యం సరఫరా ప్రారంభించాం.
– రాజేందర్, జిల్లా పౌర సరఫరాల అధికారి
సన్నబియ్యం పంపిణీకి సన్నద్ధం
సన్నబియ్యం పంపిణీకి సన్నద్ధం


