పెద్దపల్లిరూరల్: రైతులు పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు అమ్ముకునేందుకు పడుతున్న అవస్థలను దూరం చేసేందుకు వీలుగా ఆధునిక సాంకేతికతతో కూడిన శ్రీప్యాడీక్లీనర్లుశ్రీ అందుబాటులోకి వచ్చాయి. ఈ యంత్ర వినియోగం వల్ల రైతుకు కొంతమేర శ్రమ తప్పుతుంది. ధాన్యాన్ని ఎత్తి ప్యాడీ క్లీనర్‌లో పోసే పని ఉండదు. కింది భాగంలో ఉన్న ప్లేటు వద్దకు ధాన్యాన్ని లాగితే చాలు. యంత్రమే మిగతా పని పూర్తి చేసి నాణ్యమైన ధాన్యాన్ని కుప్పగా పోసేస్తుంది. అంటే రైతుకు కొంత పనిభారం తప్పనుండగా సమయం కూడా ఆదా అవుతుంది.
కలెక్టర్ చొరవతో..
జిల్లాలో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్ల కోసం ఏటా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో రైతులు ధాన్యాన్ని ఎత్తి పోస్తేనే నాణ్యమైన ధాన్యం బయటకు వస్తుంది. జిల్లా వ్యాప్తంగా ప్రతి సీజన్‌లో పలు కేంద్రాల నుంచి 10వేల క్వింటాళ్లకు పైగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. అలాంటి కేంద్రాలను గుర్తించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు జిల్లా వ్యాప్తంగా 154 కేంద్రాలు ఉన్నట్టు తేలడంతో 154 యంత్రాలను తెప్పించారు. ఈ యంత్రాల వినియోగంతో ధాన్యం తూర్పారపట్టడం కొంత సులువుగా ఉంటుంది.
ఆధునిక సాంకేతికతతో అందుబాటులోకి..
రైతులకు కొంతమేర తప్పనున్న పని భారం
జిల్లాలో..
వరి సాగువిస్తీర్ణం : 1,98,201
ధాన్యం దిగుబడి అంచనా 4.37లక్షల మెట్రిక్‌టన్నులు
సన్నరకం 1.79 లక్షల మెట్రిక్ టన్నులు
దొడ్డురకం 2.58 లక్షల మెట్రిక్ టన్నులు
కొనుగోలు కేంద్రాలు: 334
ప్యాడీక్లీనర్లు: 500
ఆధునికసాంకేతికతో కూడినవి: 154
ఈ ఫొటోలో ఉన్నది రైతులు పండించిన వరి ధాన్యంలో రాళ్లు, మట్టిపెల్లలు, తాలులాంటివి తీసి శుభ్రమైన ధాన్యాన్ని రాశిగా పోసే ఆధునిక ప్యాడీక్లీనర్. ఈ యంత్రానికి కింది భాగంలో అమర్చిన ప్లేటు వద్దకు రైతు ధాన్యాన్ని పారతో లాగితే చాలు.. యంత్రమే ధాన్యాన్ని సేకరించి తూర్పార పట్టి మరో వైపు రాశిగా పోసేస్తుంది.
ధాన్యం శుభ్రతకు ప్యాడీక్లీనర్లు


