● రెండేళ్లక్రితం పరిశీలించిన అధికారులు ● నేటికీ కార్యరూపం దాల్చని వైనం
గోదావరిఖని: పెద్దపల్లి – మంచిర్యాల జిల్లాలను కలుపుతూ గోదావరి నదిపై నిర్మించిన రెండు వంతెనలు.. ఆ పక్కనే సమ్మక్క – సారలమ్మ గద్దెలు.. నిత్యం వేలాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు వీలుగా నిర్మించిన ఘాట్లు.. తీరంలోనే ఎత్తయిన శివుని విగ్రహం.. ఇవన్నీ గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి వన్నె తెచ్చి పెడుతున్నాయి.. సుందిళ్ల బ్యారేజీలో నీటి నిల్వలు పెంచితే బ్యాక్‌వాటర్‌లో అందుబాటులోకి వచ్చే బోటింగ్ సౌకర్యం.. ఇది పర్యాటకులను ఆకర్షించే ప్రక్రియ. వీరికి విడిది సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో శారదానగర్ సమీపంలో హరిత హోటల్ నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆ శాఖ అధికారులు రెండేళ్ల క్రితం ఇక్కడకు వచ్చారు. హోటల్ నిర్మాణానికి అనువైన స్థలాన్ని పరిశీలించి వెళ్లిపోయారు. కానీ, ఆ ప్రతిపాదనలు ఇంకా కార్యరూపం దాల్చలేదు. హరిత హోటల్ నిర్మాణం పూర్తయితే పర్యాటకులు అత్యధికంగా తరలివచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజీవ్‌రహదారి పక్కనే హరిత హోటల్ నిర్మిస్తే.. ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రజలకు కూడా అనుకూలంగా ఉంటుందని, మంచి భోజన, వసతి అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.
రామునిగుండాలు వద్ద భారీ విగ్రహం
రామునిగుండాలు గుట్టపై సుమారు 152 అడుగుల ఎత్తుతో పంచముఖ హనుమాన్ విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. ఇందుకోసం 60 అడుగుల వెడల్పుతో సుమారు కిలోమీటరు పొడవున రోడ్డు నిర్మిస్తున్నారు. దీనికోసం రూ.2కోట్ల ఖర్చు చేయనున్నారు. పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. దీంతో రామునిగుండాలుకు కూడా పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
రాజీవ్ రహదారిపై రద్దీ..
మంచిర్యాల జిల్లా కోటపల్లి శివారులోని అర్జునగుట్ట వద్ద వంతెన నిర్మించడంతో రాజీవ్ రహదారిపై ప్రయాణించే వారి సంఖ్య పెరిగింది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన ప్రయాణిలకు ఇదే అనువైన మార్గం. అయితే, తమ పనుల్లో అనూహ్యంగా ఆలస్యమైతే.. రోడ్డు వెంట ఉండే హరి తహోటల్‌లో సేదతీరేందుకు అవకాశం ఉంటుంది. ఈక్రమంలో ఈప్రాంతంలో హరిత హోటల్ నిర్మాణం అత్యంత అవసరమని అంటున్నారు.
పర్యాటకాభివృద్ధికి కృషి
గోదావరి తీరంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తాం. అసెంబ్లీలో కూడా ఈ విషయం గురించి మాట్లాడా. సింగరేణి సహకారంతో సమ్మక్క–సారలమ్మ గద్దెల సమీపంలో భక్తులు, పర్యాటకులు బసచేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. దీనికోసం సింగరేణి యాజమాన్యం రూ.3 కోట్లు కేటాయించింది.
– మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్,
ఎమ్మెల్యే, రామగుండం


