● ఎన్టీపీసీ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత
జ్యోతినగర్(రామగుండం): రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టులో హిందీ భాష అమలుకు స్వర్ణశక్తి అవార్డు రావడం అభినందనీయమని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత అన్నారు. ప్రాజెక్టు పరిపాలన భవనంలో అధికారిక భాష అమలు కమిటీ త్రైమాసిక సమావేశం శుక్రవారం జరిగింది. హిందీ వినియోగం, ప్రచారం, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం సాధించడానికి చేసే ప్రయత్నాల గురించి సీనియర్ అధికారులతో ఆయన చర్చించారు. హిందీ మాట్లాడడాన్ని ప్రోత్సహించడంలో అధికార భాషా విభాగం చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. సౌత్ రీజియన్ రీజినల్ హెచ్‌ఆర్ హెడ్ ఎస్‌ఎన్ పాణిగ్రాహి మాట్లాడుతూ.. ఎన్టీపీసీ ఉద్యోగుల్లో హిందీ భాషపై ఆసక్తి, అవగాహన పెంచడానికి నాటక ప్రదర్శన నిర్వహించాలన్నారు. అనంతరం వర్చువల్ విధానంలో న్యూఢిల్లీలోని అధికార భాషా విభాగం అధిపతి అతర్‌సింగ్‌గౌతమ్ కమిటీ సభ్యులకు మార్గనిర్దేశం చేశారు. అధికారిక భాష –2024–25 వార్షిక పత్రికను విడుదల చేశారు. తెలంగాణ జనరల్ మేనేజర్ (ఓ అండ్ ఎం) దాస్, జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్) సింఘా రాయ్, అధికారులు, పాల్గొన్నారు.


