ఎండాకాలం.. జరపదిలం
● అప్రమత్తమైన జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ● గ్రామీణులకు విస్తృతంగా అవగాహన ● ఎంఎల్‌హెచ్‌పీలకు ఇప్పటికే శిక్షణ ● వడదెబ్బ నియంత్రణకూ పకడ్బందీ చర్యలు
పెద్దపల్లిరూరల్: జిల్లాలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతున్నాయి. వివిధ పనులు, అవసరాల కోసం ఇళ్లనుంచి బయటకు వెళ్లే జిల్లావాసులు అత్యంత జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈమేరకు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలోని ఎంఎల్‌హెచ్‌పీలు ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌వో అన్నప్రసన్న కుమారి ఆదేశాలు జారీచేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
ఎండలో వెళ్తే..
వేసవిలో అనారోగ్య సమస్యలు, వడదెబ్బ నివారణ గురించి ఇటీవల జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా సమీక్షించారు. ఎండలో పనిచేయాల్సి వస్తే కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచించారు. ప్రధానంగా గ్రామీణులకు ఈ విషయంలో అవగాహన కల్పించాలని నిర్ణయించారు. అధిక ఎండలో బయటకు వెళ్తే శరీరం వేడెక్కి జ్వరం వస్తుంది. మగతగా ఉంటుంది. ఇలాంటి సమస్యలు తలెత్తితే.. హీట్ పైరాక్సియా అంటారు. శరీర ఉష్ణోగ్రత 102 ఫారాన్ డిగ్రీల వరకు ఉంటుంది. ఎండలో సాధారణ పనులకు వెళ్లే వారికి ఇలా వేడి ఉంటుంది.
లవణాలు పోతాయి.. కండరాలు పట్టేస్తాయి
చెమట ద్వారా శరీరంలోని నీరు, లవణాలు బయటకు వెళ్తాయి. ఇలాంటి సమయంలో అలసటకు గురైతే హీట్ ఎక్సాస్టెన్ అంటారు. అధిక ఎండ ఉండగా.. పొలం పనులు చేసినా, వేడిగా ఉండే ఇంట్లో పనిచేసినా దీనిబారినపడతారు.
● బొగ్గు, ఇతర గనులు, వేడి తీవ్రతలో పనిచేస్తే కండరాలు పట్టేస్తాయి. దీనిని హీట్‌క్రాంప్ అంటారు.
● ఎండ తీవ్రత, వడగాలితో శరీర ఉష్ణోగ్రత 110 ఫారన్ డిగ్రీల వరకు పెరిగితే హీట్‌స్ట్రోక్(వడదెబ్బ)కు గురవుతారు. తీవ్రమైన తలనొప్పి, నాలుక తడి ఆరడం, అధిక దాహం వేయడం, కళ్లు గుంజడం, తలతిరగడం లాంటి లక్షణాలు ఏర్పడతాయి. వాంతులు, విరోచనాలకు గురవుతారు. ఈ పరిస్థితులు గుర్తించి వెంటనే చికిత్స అందిస్తే బాధితులకు ప్రాణాపాయం తప్పుతుందని వైద్యులు వివరిస్తున్నారు.
ఇలా చేయండి : వైద్యులు
● వడదెబ్బకు గురైన వ్యక్తికి అవసరమైనంత నీరు తాగించాలి. అప్పుడు కూడా లేవలేని పరిస్థితిలో ఉంటే ఓఆర్‌ఎస్ ద్రావణం తాగించాలి. ఆ తర్వాత బాధితులను వెంటనే సమీప ఆస్పత్రికి తీసుకెళ్లాలి.
● చల్లని నీటిలో ముంచిన గుడ్డను తలపై వేయాలి. శరీరాన్ని తరచూ తుడవాలి. మజ్జిగా, గంజి, నిమ్మరసం లాంటి ద్రవ పదార్థాలు తాగించాలి.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
● ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకూడదు. ప్రయాణాలు మానుకోవాలి. తప్పనిసరి అయితే ఉదయం, రాత్రి వేళల్లో మాత్రమే ప్రయాణం, పనులు చేయాలి.
● బయటకు వెళ్లినప్పుడుడు కచ్చితంగా తాగునీరు వెంట తీసుకెళ్లాలి.
● పిల్లలు, పెద్దలు ఎవరైనా బయటకు వెళ్తే కాటన్‌గుడ్డ తలకు చుట్టుకోవాలి. లేదా గొడుగు, టోపీ ధరించాలి.
● కాళ్లకు చెప్పులు వేసి కోవాలి. వదులుగా వుండే నూలు దుస్తులను వేసుకోవాలి.
● అధికంగా ఎండ ఉంటే ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేయరాదు.
● మసాలా, ఆయిల్, వేపుడు ఆహార పదార్థాలు తినకూడదు. కీరదోస, తర్బూజ, పుచ్ఛపండు లాంటివి తీసుకోవడం ఉత్తమం.
పిల్లలు, వృద్ధులకు వడదెబ్బ
వడదెబ్బ ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల్లో అధికంగా వచ్చేఅవకాశం ఉంది. వారిని ఎండలోకి వెళ్లనివ్వవద్దు. పిల్లలు ఇంట్లోనే ఆడుకునే ఏర్పాట్లు చేయాలి. ఇలా చేయడం ద్వారా వడదెబ్బ నుంచి బయటపడొచ్చు.
– అన్న ప్రసన్నకుమారి, డీఎంహెచ్‌వో


