ఆర్థిక సంఘం గ్రాంట్స్‌కు అర్హత
● 72.50 శాతం ఆస్తిపన్ను వసూలుతో ఘనత ● గతేడాది కన్నా మెరుగైన ఆర్థిక పరిస్థితి
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 15వ ఆర్థిక సంఘం గ్రాంట్స్‌కు అర్హత సాధించింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 72.50శాతం ఆస్తిపన్ను వసూలు చేసి ఈఘనత సొంతం చేసుకుంది. నిర్దేశిత 100 శాతం ఆస్తిపన్ను వసూలు చేయకపోయినా.. గతేడాదితో పోల్చితే ఈసారి పనితీరు మెరుగుపర్చుకుంది. గతేడాది మార్చి 31 నాటికి 55.58 శాతం ఆస్తిపన్ను వసూలు కాగా, ఈఏడాది 72.50 శాతం వరకు నమోదు చేయడం గమనార్హం. నగరపాలక సంస్థ స్పెషలాఫీసర్‌గా వ్యవహరిస్తున్న కలెక్టర్ కోయ శ్రీహర్ష.. కమిషనర్(ఎఫ్‌ఏసీ)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అదనపు కలెక్టర్ అరుణశ్రీ ప్రత్యేక దృష్టి సారించడంతో ఫలితం దక్కిందని అధికారులు అంటున్నారు.
డిమాండ్ రూ.14.76 లక్షలు
బల్దియాలో ఆస్తిపన్ను రూ.14.76 లక్షల డిమాండ్ ఉండగా, ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు రూ.10.70లక్షల వరకు వసూలుచేసి 72.50 శాతం నమోదు చేయగలిగింది. గతేడాది 55.58శాతమే ఆస్తిపన్ను వసూలు చేసింది. గత ఐదేళ్ల స్థూల ఉత్పత్తి సగటు 12.09 శాతానికి మించి ఈసారి ఆస్తిపన్ను వసూలు కావడంతో రామగుండం బల్దియా 15వ ఆర్థిక సంఘం గ్రాంట్స్ పొందడానికి అర్హత సాధించినట్లయ్యింది.
వసూళ్లలో వార్డు ఆఫీసర్లు..
గ్రూప్–4 నియామకాలు పూర్తికావడంతో కొంద రు ఉద్యోగులు వార్డు అధికారులుగా ఇటీవల విధుల్లో చేరారు. రెవెన్యూ శాఖ నుంచి వచ్చిన మరికొందరు సిబ్బంది అందుబాటులో ఉన్నారు. దీంతో బల్దియా కమిషనర్ అరుణశ్రీ.. రెండు నెలల క్రితం ఓ మంచినిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు నగరంలోని నివాసాలన్నీ 22 రెవెన్యూ బ్లాకుల్లో భాగమై ఉండేవి. ఒక్కో బ్లాక్‌కు ఒక బిల్ కలెక్టరే ఆస్తిపన్ను వసూలు చేసేవారు. కమిషనర్ నిర్ణయంతో ఎలక్షన్ డివిజన్ల ప్రాతిపదికన 50 డివిజన్లుగా విభజించారు. అందుబాటులో ఉన్న సిబ్బందికి తోడు కొత్తగా నియామకమైన వారికి ఆస్తిపన్ను వసూలు విధు లు కేటాయించారు. ఇలా ఒక్కో డివిజన్‌కు ఒకరు చొప్పున 50 డివిజన్లకు మొత్తం 50 మందిని వార్డు ఆఫీసర్లుగా నియమించారు. వారికి సహాయకులుగా కార్యాలయంలో అదనంగా ఉన్న సిబ్బందిని నియమించారు. ఉదయం 8 గంటల నుంచే ఆస్తిపన్ను వసూళ్ల పురోగతిపై కమిషనర్ సమీక్షిస్తుండడంతో సత్ఫాలితాలు వచ్చాయి.


