మూలన పడిన రోటీ ‘మేకింగ్’
● రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసి.. వదిలేసిన సింగరేణి యాజమాన్యం ● అల్పాహారంగా చపాతీ ఇవ్వాలని కార్మికుల డిమాండ్
గోదావరిఖని: సింగరేణి క్యాంటీన్లలో కార్మికులకు చపాతీలను అల్పాహారంగా అందించాలని గతంలో యాజమాన్యం నిర్ణయించింది. దీనికోసం గ్యా స్‌తో నడిచే రోటీమేకింగ్ మిషన్లు కొనుగోలు చేసింది. కొంతకాలంపాటు సజావుగా సాగిన ఈప్రక్రియ.. తర్వాత ఏమైందో ఏమోగానీ.. మిషన్లను మూలనపడేశారు. రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన యంత్రాలు పనిచేయకుండా పోవడంపై సింగరేణి కార్మికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతీ గనిపై క్యాంటీన్..
సింగరేణిలోని 11ఏరియాల్లో సుమారు 40వేల మందికిపైగా కార్మికులు పనిచేస్తున్నారు. ప్రతీగని, ఓసీపీ, డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న కార్మికులకు తక్కువ ధరకే అల్పాహారం అందిస్తున్నారు. ప్రస్తు తం ఉప్మా, ఇడ్లీ, వడ, పూరీ, మసాలావడ అందు బాటులో ఉన్నాయి. వీటితోపాటు నూనెతక్కువగా వినియోగించే చపాతీలనూ అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం గ్యాస్‌తో నడిచే చపాతీ యంత్రాలను 2018లో కొనుగోలు చేశారు. కొద్దిరోజులపాటు వాటిని చపాతీల తయారీకి వినియోగించారు. ఆ తర్వాత యంత్రాల్లో లోపాలు తలెత్తాయి. రొట్టెలు సరిగా కాలకపోవడం, చపాతీలు సరిగా తయారు కాకపోవడంతో మరమ్మతులు చేయించాల్సిన అధికారులు.. వాటిని పక్కనపడేశారు. దీంతో క్యాంటీన్లలో చపాతీల తయారీ నిలిచిపోయింది.


