ప్రాణం తీసిన క్రికెట్ బాల్
● చికిత్స పొందుతూ బాలుడి మృతి ● విషాదంలో కుటుంబం
వేములవాడ: వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ ప్రాంతానికి చెందిన దారం అశ్విత్‌రెడ్డి(10) హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందారు. గంగాధర మండలం రంగారావుపల్లికి చెందిన దారం శ్రీనివాస్‌రెడ్డి వేములవాడలోని కోరుట్లబస్టాండ్ ప్రాంతంలో కొన్నేళ్లుగా మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు. శ్రీనివాస్‌రెడ్డికి పదేళ్ల కొడుకు అశ్విత్‌రెడ్డి, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఒంటిపూట బడులు నడుస్తుండడంతో ఈనెల 3న స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అశ్విత్‌రెడ్డి స్నేహితులతో క్రికెట్ ఆడడానికి వెళ్లాడు .ఇంటికి తిరిగి వచ్చి యథావిధిగా మరుసటి రోజు పాఠశాలకు వెళ్లాడు. అయితే పాఠశాలలో తనకు తలనొప్పిగా ఉందని చెప్పడంతో వెంటనే శ్రీనివాస్‌రెడ్డి వెళ్లి వైద్యుడు దగ్గరికి తీసుకెళ్లాడు. తనకు తలపై క్రికెట్‌బాల్ తలిగిందని బాలుడు తెలపడంతో పరీక్షించిన వైద్యులు తలలో రక్తస్రావమవుతున్నట్లుగా వైద్యులు గుర్తించారు. వెంటనే మెరుగైన చికిత్స కోసం కరీంనగర్, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. వెంటనే అక్కడి వైద్యులు ఆపరేషన్ చేశారు. మళ్లీ ఈనెల 7న రెండోసారి కూడా తలకు శస్త్రచికిత్స చేయగా.. మంగళవారం బ్రెయిన్‌డెడ్ అయ్యాడు.
నకిలీ వైద్య సర్టిఫికెట్లు సృష్టించిన వ్యక్తి రిమాండ్
ఇల్లంతకుంట(మానకొండూర్): మెడికల్ ఇన్‌వాలిడేషన్ కోసం నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి ఇచ్చిన వ్యక్తిని మంగళవారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై శ్రీకాంత్‌గౌడ్ తెలిపారు. ఇల్లంతకుంట మండలం గాలిపల్లి పశువైద్యశాలలో ఆఫీసు సబార్డినేటుగా విధులు నిర్వహిస్తున్న కత్తి దేవమ్మ మెడికల్ ఇన్‌వాలిడేషన్ కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంది. జిల్లా అధికారులు వాటిని పరిశీలించగా నకిలీవని తేలింది. దీంతో నకిలీ మెడికల్ సర్టిఫికెట్ల తయారీలో సంబంధం ఉన్న కరీంనగర్‌కు చెందిన ల్యాబ్ టెక్నీషియన్ యూసుఫ్‌ను మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే కత్తి దేవమ్మ, జేరిపోతుల సంజీవ్‌లను రిమాండ్‌కు తరలించారు. కేసు విచారణ కొనసాగుతుందని ఎస్సై తెలిపారు.
పుస్తెలతాడు అపహరణ
వీణవంక: మామిడాలపల్లి గ్రామానికి చెందిన అవరకొండ సరమ్మ ఆరుబయట నిద్రించగా గుర్తు తెలియని పుస్తెలతాడును ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉక్కపోత భరించలేక సోమవారం రాత్రి ఆరుబయట నిద్రించగా తెల్లవారుజామున చూసే సరికి మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడు కనిపించలేదు. దీంతో కుటుంబీకులకు చెప్పుకోగా మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తోట తిరుపతి తెలిపారు.
మానవత్వం చాటుకున్న గ్రామస్తులు
చొప్పదండి: నిరుపేద అర్చకుని భార్య మృతి చెందడంతో అంత్యక్రియలకు తమవంతు సాయం చేసి, అంత్యక్రియల్లో పాల్గొని మానవత్వం చాటుకున్నారు మండలంలోని ఆర్నకొండ గ్రామస్తులు. ఆర్నకొండలోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో పదేళ్లుగా నమిలికొండ మురళీకృష్ణ అర్చకుడిగా పని చేస్తున్నాడు. మంగళవారం అర్చకుడి భార్య ఆకస్మిక మృతి చెందగా, పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న అర్చకుడి కుటుంబానికి గ్రామస్తులు అండగా నిలిచారు. గంట సమయంలోనే సుమారు రూ.50వేల వరకు పోగు చేసి, దగ్గరుండి అంత్యక్రియలు పూర్తి చేశారు. అర్చక కుటుంబానికి అండగా నిలిచిన గ్రామస్తులకు అర్చక పురోహితుల సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రాణం తీసిన క్రికెట్ బాల్


