నాణ్యమైన ధాన్యానికి మద్దతు ధర
● నిర్దేశిత తేమశాతం వచ్చాకే మార్కెట్‌కు తేవాలి ● అన్నదాతలకు కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచనలు
సుల్తానాబాద్(పెద్దపల్లి): నిర్దేశిత తేమశాతం వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన వెంటనే రైస్‌మిల్లులకు తరలించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. అదనపు కలెక్టర్ వేణుతో కలిసి స్థానిక వ్యవసాయ మార్కెట్‌ను కలెక్టర్ బుధవారం సందర్శించారు. కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు, రవాణాలో హమాలీ సమస్య తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కేటాయించిన రైస్ మిల్లులకే ధాన్యం తరలించాలని సూచించారు. గ్రేడ్ ఏ– రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.2,320, సాధారణ రకం క్వింటాల్‌కు రూ.2,300 మద్దతు ధర చెల్లించాలని అన్నారు. జిల్లా పౌర సరఫరాల మేనేజర్ శ్రీకాంత్, అధికారి రాజేందర్, తహసీల్దార్ రాంచందర్‌రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, డిప్యూటీ తాహసీల్దార్ మహేశ్, మార్కెట్ కార్యదర్శి మనోహర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, జిల్లాలో 90 రైస్ మిల్లులకే ధాన్యం కేటాయించారని, మిగతా మిల్లులకు కూడా ధాన్యం కేటాయించాలని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మోరపల్లి తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి కలెక్టర్‌కు విన్నవించారు. అయితే, బకా యి పడిన మిల్లులకు ధాన్యం కేటాయించేది లేదని, బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన వాటికి కేటాయిస్తామని ఆయన వివరించారు. హమాలీ సమస్య పరిష్కరించాలని పలువురు కలెక్టర్‌కు విన్నవించారు.


